Jhulan Goswamy : మహిళా క్రికెట్లో చరిత్ర సృష్టించిన జులన్‌ గోస్వామి.!

భారత మహిళా క్రికెట్‌ సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. వన్డే క్రికెట్లో 250 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం..

Published : 16 Mar 2022 16:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత మహిళా క్రికెట్‌ సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. వన్డే క్రికెట్లో 250 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచులో ఒక వికెట్‌ పడగొట్టిన జులన్‌ ఈ ఘనత సాధించింది. మహిళా క్రికెట్లో అరుదైన ఘనత సాధించిన జులన్‌ను అభినందిస్తూ ఐసీసీ, ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ట్వీట్లు చేశాయి. ‘ఇంత గొప్ప ఘనత సాధించిన జులన్‌ గోస్వామికి శుభాకాంక్షలు. క్రికెట్లో ఆమె లెజెండ్. గొప్ప పోరాట యోధురాలు. యువ క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచావు’ అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ట్వీట్ చేసింది.

ఇప్పటి వరకు 199 వన్డేలు ఆడిన జులన్‌ 250 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బౌలర్‌ ఫిట్జ్‌ ప్యాట్రిక్‌ (180 వికెట్లు) రెండు, వెస్టిండీస్‌ పేసర్‌ అనిసా మహమ్మద్‌ (180 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచులో భారత జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (35), వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ (33), జులన్ గోస్వామి (20) మినహా.. మిగతా ప్లేయర్లంతా విఫలమయ్యారు. అనంతరం, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. హీథర్‌ నైట్ (53), నటాలీ సివర్‌ (45) రాణించడంతో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచులు ఆడిన భారత జట్టు రెండింట్లో నెగ్గి, మరో రెండింట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని