WFI: పోటీల నిర్వహణపై ముందస్తు ప్రకటన.. డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్యానెల్‌పై కేంద్రం వేటు

నిబంధనలకు విరుద్ధంగా పోటీల నిర్వహణపై ముందస్తు ప్రకటన చేయడంతో డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

Updated : 24 Dec 2023 13:55 IST

దిల్లీ: ఇటీవల జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ ప్యానెల్‌ క్రీడా మంత్రిత్వ శాఖ విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపింది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అండర్‌-15, అండర్‌-20 జాతీయ పోటీలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించనున్నట్లు సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 

‘‘డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్ ఎన్నికైన తర్వాత అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను ఈ ఏడాది చివరినాటికి ఉత్తరప్రదేశ్‌లోని నందినీ నగర్‌, గోండాలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు విరుద్ధం. పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటన చేయడం తొందరపాటు చర్య. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ (UWW) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాలి. అందుకు విరుద్ధంగా ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేశాం’’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 

డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను సస్పెండ్‌ చేయడంపై రెజ్లర్లు, పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ స్పందన తెలియజేశారు. ‘‘క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను సస్పెండ్‌ చేసింది. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశను కలిగించింది’’ అని గీతా ఫొగట్‌ ట్వీట్‌ చేశారు. ‘‘అమ్మాయిలు రెజ్లింగ్‌కు దూరమయ్యేలా చేసిన, అబ్బాయిలు పద్మశ్రీని వెనక్కిచ్చేలా చేసిన రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేశారు. ఇదే ముందే చేసుండాల్సింది’’ అని బాక్సర్ విజేందర్‌ సింగ్‌ ట్వీట్ చేశాడు. 

బజ్‌రంగ్‌ బాటలో వీరేందర్‌

రెండు రోజుల క్రితం నిర్వహించిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్ ఎన్నిక కావడాన్ని భారత స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ సహా కొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నిక తీవ్ర నిరాశకు గురిచేసిందని, దీనికి నిరసనగా తాను రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సాక్షి ప్రకటించారు. ఆమెకు మద్దతుగా బజరంగ్‌ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. ఇదే క్రమంలో డెఫ్లింపిక్స్‌ (బధిరుల ఒలింపిక్స్‌) పసిడి విజేత వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని శనివారం ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని