Bairstow: కోహ్లీతో గొడవ.. బెయిర్‌స్టో ఏమన్నాడంటే..?

భారత్‌తో జరుగుతోన్న అయిదో టెస్టులో విరాట్‌ కోహ్లీతో జరిగిన వాగ్వాదంపై ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో స్పందించాడు. అది కేవలం ఆటలో భాగం మాత్రమే అని అన్నాడు. మైదానంలో తీవ్రమైన పోటీ

Published : 04 Jul 2022 14:01 IST

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో జరుగుతోన్న అయిదో టెస్టులో విరాట్‌ కోహ్లీతో జరిగిన వాగ్వాదంపై ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో స్పందించాడు. అది కేవలం ఆటలో భాగం మాత్రమే అని అన్నాడు. మైదానంలో తీవ్రమైన పోటీ నెలకొన్నప్పుడు అలాంటి ఘటనలు జరగడం సహజమేనని అన్నారు.

ఐదు టెస్టులో భాగంగా మూడో రోజు (ఆదివారం) ఆట ప్రారంభమైన కొద్ది సేపటికి కోహ్లీ, బెయిర్‌స్టో గొడవ పడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం ఈ వివాదం గురించి బెయిర్‌స్టోను మీడియా ప్రశ్నించగా.. ‘‘అయ్యో.. నిజంగా అందులో ఏం లేదు’’ అని తెలిపాడు. ‘‘గత 10 ఏళ్లుగా మేం ప్రత్యర్థులుగా ఆడుతున్నాం. మైదానంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతుంటాయి. మేం టెస్టు క్రికెట్‌ ఆడుతున్నాం. ఇందులో మేం ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం. టెస్టు క్రికెట్‌ మనలోని ఉత్తమ ప్రదర్శనను బయటకు తీసుకొస్తుంది. అందులో ఏం జరిగినా.. మన జట్టును గట్టి పోటీలో ఉంచాలనే అనుకుంటాం. అదంతా గేమ్‌లో భాగమే’’ అని ఇంగ్లాండ్ బ్యాటర్‌ చెప్పుకొచ్చాడు. మైదానంలో ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ.. మేం మళ్లీ కలిసి డిన్నర్‌ చేస్తామని, అందులో ఆందోళనపడాల్సిందేమీ లేదని బెయిర్‌స్టో అన్నాడు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో తొలి బంతి ఆడిన తర్వాత కోహ్లి, బెయిర్‌స్టో మాటలు అనుకుంటూ.. ఒకరిపైకి మరొకరు వచ్చారు. క్రీజులో నిలబడమంటూ బెయిర్‌స్టోకు కోహ్లి చెప్పడం కనిపించింది. బెయిర్‌స్టో కూడా దీటుగా స్పందించడంతో అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే కోహ్లీతో మాటల యుద్ధానికి ముందు 61 బంతుల్లో 13 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఆ తర్వాత 79 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. దీంతో కోహ్లీ అతడిని అనవసరంగా రెచ్చగొట్టాడంటూ మాజీ క్రికెట్‌ సెహ్వాగ్‌ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో సెంచరీ (140 బంతుల్లో 106 పరుగులు) నమోదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని