Virushka: మా లక్ష్యం ₹11 కోట్లు చేరుకున్నాం

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రారంభించిన ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ అనే ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి విశేషమైన స్పందన లంభించింది. ఈ మేరకు తాము నిర్దేశించుకున్న రూ.11కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లు చెప్పారు...

Updated : 14 May 2021 18:21 IST

(Photo: Virat Kohli Twitter)

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రారంభించిన ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి విశేషమైన స్పందన లంభించింది. ఈ మేరకు తాము నిర్దేశించుకున్న రూ.11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లు విరుష్క దంపతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో ఇటీవల కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ కోహ్లీ, అనుష్క దంపతులు ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ పేరిట కొవిడ్‌-19 రిలీఫ్‌ కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి విరుష్క దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఎంపీఎల్‌ అనే క్రీడా సంస్థ వారికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ లక్ష్యాన్ని రూ.11 కోట్లకు పెంచుకున్నారు. ఈరోజు తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు విరుష్క దంపతులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.

‘మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా ఆశ్చర్యపోయాను. మేం తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇదిలాగే కొనసాగుతుంది. దేశ ప్రజలకు సహాయం చేయడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జై హింద్’ అని అనుష్క తన సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ.11,39,11,820 నగదు జమ అయినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని