వాన్‌..! మిమ్మల్ని మీరే కించపర్చుకుంటున్నారు

ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ కించపర్చుకుంటున్నాడని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ తనదైనశైలిలో ఎగతాళి చేశాడు...

Published : 19 Mar 2021 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ కించపర్చుతున్నాడని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ తనదైనశైలిలో ఎగతాళి చేశాడు. గతరాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన కీలకమైన నాలుగో టీ20లో కోహ్లీసేన 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 177/8 పరుగులకు పరిమితమైంది. దీంతో సిరీస్‌ 2-2తో సమానంగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఆడిన 11 మందిలో ముగ్గురు ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లుండటం విశేషం.

ఈ విషయాన్ని గుర్తించిన వాన్‌.. మ్యాచ్‌ అనంతరం ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఇది గుర్తుకు వచ్చిన ఓ విషయం మాత్రమే. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(ముంబయి ఇండియన్స్‌), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(ముంబయి ఇండియన్స్‌), యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(ముంబయి ఇండియన్స్‌)’ అని పేర్కొంటూ ఆ ఫ్రాంఛైజీని ట్యాగ్‌ చేశాడు. కాగా, ఈ ముగ్గురూ టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా కోహ్లీ కాసేపు మైదానం వీడిన సమయంలో రోహిత్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అదే సమయంలో హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో జేసన్‌(40; 27 బంతుల్లో 6x4, 1x6) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్‌ ఒడిసిపట్టాడు. ఆపై శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌(46; 23 బంతుల్లో 4x4, 3x6) క్యాచ్‌ను కూడా సూర్యనే అందుకున్నాడు. తర్వాత పాండ్య.. సామ్‌కరన్‌(3)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో పాండ్య నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీయడమే కాకుండా 16 పరుగులే ఇచ్చి మంచి ప్రదర్శన చేశాడు. ఇక టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురూ టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారని వాన్‌ పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.

ఆ ట్వీట్‌కు జాఫర్‌ స్పందిస్తూ వాన్‌ పేరు ప్రస్తావించకుండానే ట్రోల్‌ చేశాడు. ‘జాతీయ జట్టుతో కాకుండా ఒక ఫ్రాంఛైజీ జట్టుతో మీ ఇంగ్లాండ్‌ జట్టు ఓడిపోయిందని చెప్పినప్పుడు.. మీరు ప్రత్యర్థిని ట్రోల్‌ చేయడం కాదు. మీ సొంత జట్టును మీరే ట్రోల్‌ చేసుకుంటున్నారని అర్థం’ అని జాఫర్‌ దీటుగా పేర్కొన్నాడు. కాగా, కొద్ది రోజుల క్రితం వాన్‌ ఇలాగే ఇంకో ట్వీట్‌ చేశాడు. టీమ్‌ఇండియా కన్నా ముంబయి ఇండియన్సే గొప్ప జట్టని తొలి టీ20 సందర్భంగా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని