Rohit Sharma : ఆ ముగ్గురిని భవిష్యత్‌ నాయకులుగా తీర్చి దిద్దుతాం : రోహిత్‌ శర్మ

భారత జట్టుకు భవిష్యత్తులో సారథ్యం వహించే నాయకులను ఇప్పటి నుంచే తయారు చేస్తామని కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్, సీనియర్‌ పేసర్‌..

Published : 24 Feb 2022 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత జట్టుకు భవిష్యత్తులో సారథ్యం వహించే నాయకులను ఇప్పటి నుంచే తయారు చేస్తామని కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్, సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రాలను భవిష్యత్తు కెప్టెన్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నాడు. శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్  సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడాడు.

‘భవిష్యత్తు నాయకులను తయారు చేసే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం కూడా సీనియర్ల నుంచి నేర్చుకునే ఈ స్థాయికి వచ్చాం. అది సహజ ప్రక్రియ. మేం కూడా అదే పద్దతిలో కెప్టెన్లను సిద్ధం చేస్తాం. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, బుమ్రా.. ముగ్గురూ ఎంతో పరిణతితో ఆలోచించగల క్రికెటర్లు. వారికి అన్ని విషయాలు మనమే నేర్పించాల్సిన అవసరం లేదు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లో వారికి మార్గనిర్దేశం చేయడానికి ఒకరు కావాలి. అయితే, టీమిండియా కోసం ఏం చేయాలో వారికి తెలుసు. భవిష్యత్తులో జట్టుని నడిపించే బాధ్యత వారిపై ఉంది. వాళ్లపై మరింత ఒత్తిడి తీసుకు రావాలనుకోవట్లేదు. మైదానంలో స్వేచ్ఛగా ఆడుతూ.. వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేలా చూస్తాం’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే, రోహిత్‌ని తీర్చి దిద్దిన ఆటగాడి పేరు అతడు పేర్కొనలేదు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలోనే.. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలను భవిష్యత్‌ కెప్టెన్లుగా తీర్చి దిద్దిన విషయం తెలిసిందే. 

* సత్తా ఉంటే.. ఎవరినైనా ప్రోత్సహిస్తాం.. 

‘కెప్టెన్‌గా నియమించే ఆటగాడు బ్యాటరా? బౌలరా? అనే విషయంతో పని లేదు. సమర్థంగా జట్టుని నడిపించగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లను కచ్చితంగా ప్రోత్సహిస్తాం. జస్ప్రీత్ బుమ్రాను నేను చాలా దగ్గరి నుంచి గమనించాను. అతడి వ్యూహాలు చాలా గొప్పగా ఉంటాయి. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే.. జట్టుని మెరుగ్గా నడిపించగలడనే నమ్మకం ఉంది’ అని రోహిత్ శర్మ చెప్పాడు. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని