Dhoni: స్కూల్లోనూ మాథ్స్‌లో వీక్‌.. ప్లేఆఫ్స్‌ లెక్కలు ఆలోచించట్లేదు: ధోనీ

చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్‌ గురించి ఆలోచించట్లేదని, నెట్‌ రన్‌రేట్‌ విషయంపైనా ఆలోచించడం అనవసరమని కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు...

Updated : 09 May 2022 09:32 IST

ముంబయి: చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్‌ గురించి ఆలోచించట్లేదని, నెట్‌ రన్‌రేట్‌ విషయంపైనా ఆలోచించడం అనవసరమని కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు మొత్తం 8 పాయింట్లు సాధించి ఇంకా టెక్నికల్‌గా ప్లేఆఫ్స్‌ రేసులో కొనసాగుతోంది. అయితే, అదంత తేలిక కాదు. చెన్నై టాప్‌-4లో నిలవాలంటే మిగతా జట్లు భారీ ఓటములు చవిచూడటంతో పాటు చెన్నై ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ గొప్ప విజయాలు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి దిల్లీపై విజయం సాధించిన అనంతరం మాట్లాడాడు.

‘ఇలాంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేది. ఇదో గొప్ప మ్యాచ్‌. మా బ్యాటర్లు బాగా ఆడారు. మిగతావారు ఏదో ఒక విధంగా రాణించారు. మ్యాచ్‌  గెలవాలంటే స్కోర్‌బోర్డుపై భారీ లక్ష్యం నిర్దేశించడం ముఖ్యమైన విషయం. అలాగే దిల్లీ జట్టులోని బిగ్‌ హిట్టర్లను నియంత్రించడం కూడా ఎంతో ముఖ్యం. ముఖేశ్‌, సిమర్జీత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మ్యాచ్‌లు ఆడేకొద్దీ మరింత మెరుగవుతారు. ఇక నా బ్యాటింగ్‌ విషయానికొస్తే క్రీజులోకి వెళ్లిన వెంటనే ఎడాపెడా బాదాలనుకోను. కానీ, ఈరోజు తక్కువ బంతులే మిగిలి ఉండటంతో ధాటిగా ఆడాల్సి వచ్చింది. అలాగే మేం ప్లేఆఫ్స్‌ చేరతామా లేదా అనే లెక్కలు వేసుకోవడం లేదు. నాకు లెక్కలంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు స్కూల్లోనూ మాథ్స్‌ లో వెనుకబడిపోయాను. ఇప్పుడు నెట్‌ రన్‌రేట్‌ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు. ఈ టీ20 లీగ్‌ను ఎంజాయ్‌ చేయాలంతే. తర్వాతి గేమ్‌లో ఎలా ఆడాలనేదాని గురించే ఆలోచించాలి. ఒకవేళ మేం ప్లేఆఫ్స్‌ చేరితే మంచిదే. వెళ్లకపోయినా పోయేదేం లేదు. దీంతో ప్రపంచం అంతరించిపోదు’ అని ధోనీ పేర్కొన్నాడు.

దురదృష్టంకొద్దీ అది ఈ మ్యాచ్‌లో జరిగింది: పంత్‌

ఈ ఓటమిపై దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందిస్తూ.. చెన్నై జట్టు అన్ని విభాగాల్లో రాణించిందని, తమని చిత్తుచిత్తుగా ఓడించిందన్నాడు. ‘ఈ సీజన్‌లో మేం కొన్ని మ్యాచ్‌ల్లో విజయపుటంచులదాకా వెళ్లాం. అయితే అప్పుడప్పుడూ రెండు జట్ల మధ్య ఇలాంటి భారీ తేడాల మ్యాచ్‌లు కూడా చోటుచేసుకోవాలి. దురదృష్టంకొద్దీ మేం ఈరోజు అలాంటి ఓటమివైపు నిలిచాం. కొద్ది రోజులుగా మా జట్టు మెరుగవుతోందని అనుకున్నా. కానీ, అది నిజం కాదు. ఇక మిగిలిన 3 మ్యాచ్‌ల్లో మేం విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మా జట్టులో పరిస్థితులు కూడా అంత బాగోలేవు. కరోనా కేసులతో పాటు పలువురు ఆటగాళ్లు అనారోగ్యంతో ఉన్నారు. ఇవన్నీ మా ఓటములకు కారణాలుగా చెప్పట్లేదు. ఇకపై మా ఆటగాళ్లు సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని