Updated : 18 May 2022 06:02 IST

కొత్త గూగులమ్మ

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్, వినూత్న హార్డ్‌వేర్‌.. కీలక సర్వీసులు, యాప్స్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లు! గూగుల్‌ ఏటా నిర్వహించే డెవలపర్‌ ఐ/ఓ కాన్ఫరెన్స్‌ అనగానే టెక్‌ ప్రియులు ఎదురుచూసే అంశాలివి. ఆశించినట్టుగానే ఈ సంవత్సరం కూడా గూగుల్‌ కొంగొత్త ఆవిష్కరణలను ప్రకటించింది.  పైగా ఇంకాస్త ఎక్కువ హార్డ్‌వేర్ల గురించీ ప్రస్తావించింది. మరి ఐ/ఓ 2022 విశేషాల మీద ఓ కన్నేద్దామా!

ఆండ్రాయిడ్‌ 13 బీటా 2

ఈ సారి ప్రకటించిన అప్‌డేట్స్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆండ్రాయిడ్‌ 13 బీటా 2 ఓఎస్‌ గురించే. ఇది అనువైన పిక్సెల్‌ పరికరాలకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. పిక్సెల్‌ పరికరాలు వాడేవారికి ఆసక్తి ఉంటే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రయత్నించొచ్చు. ఇతర ఫోన్ల తయారీదారులు వాడుకోవటానికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13లో యాప్స్‌ నుంచి అందే నోటిఫికేషన్ల కోసం కొత్త పర్మిషన్‌ సెటింగ్స్‌ను పరిచయం చేశారు. సమీపంలోని పరికరాలతో అనుసంధానం, మీడియా ఫైళ్ల యాక్సెస్‌ విషయంలోనూ పర్మిషన్లను మరింత మెరుగుపరచారు. ఎస్‌ఎంఎస్‌ సామర్థ్యాలను రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌) అనే కొత్త ప్రమాణంతో అప్‌గ్రేడ్‌ చేయటానికి ఫోన్‌ తయారీదారులతో కలిసి పనిచేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించటం గమనార్హం. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లకు ఆర్‌సీఎస్‌ వీలు కల్పిస్తుంది. అంతేకాదు, అత్యంత నాణ్యతతో కూడిన ఫొటోలను షేర్‌ చేసుకోవటానికి, టైప్‌ ఇండికేటర్లను చూడటానికి, వై-ఫై ద్వారా మెసేజ్‌లను పంపుకోవటానికి కూడా వీలు కల్పిస్తుంది. ఆండ్రాయిడ్‌ పరికరాలను వాడేవారి సంఖ్య ఇప్పుడు 300 కోట్లు దాటింది. వీరిలో 100కు పైగా కోట్ల మంది ఒక్క గత సంవత్సరంలోనే జత కలిశారు. కొత్త వర్షన్‌తో వీరి సంఖ్య మరింత ఎక్కువ అవుతుందనటంలో ఎలాంటి సందేశం లేదు.


గూగుల్‌ వాలెట్‌

పేమెంట్‌ కార్డులు.. సినిమాలు, కచేరీల వంటి వాటికి సంబంధించిన టికెట్లు, బోర్డింగ్‌ పాస్‌లు, విద్యార్థి ఐడీల వంటి వాటి సమాచారమంతా ఫోన్‌లో ఒకేచోట ఉంటే ఎంత బాగుంటుంది? అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవచ్చు కదా. గూగుల్‌ వాలెట్‌ ఇలాంటి సౌకర్యాన్నే కల్పిస్తుంది. ఇందులో హోటల్‌ కీస్, ఆఫీస్‌ బ్యాడ్జెస్‌లనూ సేవ్‌ చేసుకోవచ్చు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఐడీలనూ ఈ వాలెట్‌లో దాచుకోవటానికి అనుమతించేలా అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచీలకూ గూగుల్‌ వాలెట్‌ అందుబాటులోకి రానుంది. దీంతో పేమెంట్‌ సమాచారాన్ని వాచ్‌లోనే దాచుకోవచ్చు.


ఇతర స్మార్ట్‌వాచీలకూ గూగుల్‌ అసిస్టెంట్‌

గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ త్వరలో సామ్‌సంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌వాచీలకూ అందుబాటులోకి రానుంది. ఇది గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ ఫోన్ల నుంచి ఆరంభమవుతుంది. అసిస్టెంట్‌ మరింత వేగంగా పనిచేసేలా, సహజంగా మాట్లాడినట్టు అనిపించేలా కూడా తీర్చిదిద్దారు. ‘లుక్‌ యాన్‌ టాక్‌’ ఫీచర్‌ సాయంతో పరికరాన్ని చూసి, మాట్లాడటం మొదలెట్టొచ్చు. ఇది ముఖం, గొంతును సత్వరం గుర్తించి స్పందిస్తుంది. దీంతో ‘హే గూగుల్‌’ ఫీచర్‌కు ముగింపు పలికినట్టయ్యింది. 


పిక్సెల్‌ వాచ్‌

చాలా ఏళ్లుగా ఎన్నో ఊహాగానాల తర్వాత ఎట్టకేలకు పిక్సెల్‌ వాచ్‌ను తేనున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. దీని పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ సంవత్సరంలోనే దీని అమ్మకాలు ఆరంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ వాచ్‌ ఆండ్రాయిడ్‌ 8.0, అంతకన్నా ఎక్కువ పరికరాలతో మాత్రమే అనుసంధానం అవుతుంది. దీనికి ఐఓఎస్‌ కంపాటబిలిటీ లేదు. దీన్ని తుక్కు స్టీల్‌తోనే తయారు చేయటం గమనార్హం. ఈ వాచ్‌తో పాటు పిక్సెల్‌ 7 సిరీస్‌ ఫోన్లు సైతం ఈ సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి.


మరిన్ని భాషల అనువాదం

గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఇప్పుడు సంస్కృతాన్నీ అనువాదం చేసి పెట్టనుంది. దీన్ని మరో 24 భాషలను అనువాదం చేసేలా తీర్చిదిద్దారు మరి. ఇందులో 8 భాషలు మనవే. అవి.. సంస్కృతం, భోజ్‌పురి, అస్సామీ, కొంకణి, మైథిలి, డోగ్రి, మిజో, మణిపురి. కొత్తగా తోడైన భాషలను 30 కోట్లకు మందికి పైగా ప్రథమ లేదా ద్వితీయ భాషలుగా ఉపయోగిస్తున్నారని గూగుల్‌ చెబుతోంది. 


మ్యాప్స్‌ సరికొత్తగా..

అధునాతన టెక్నాలజీలతో గూగుల్‌ మ్యాప్స్‌ ఇప్పుడు భారత్, ఆఫ్రికా, ఇండోనేషియా దేశాల్లోని కట్టడాలను మరింత స్పష్టంగా, వివరంగా చూపించనుంది. వినూత్నమైన ‘ఇమ్మెర్సివ్‌ వ్యూ’ టెక్నాలజీ సాయంతో ఆయా పట్టణాలను ఎంచుకొని వాతావరణం తీరుతెన్నులు, వాహనాల రద్దీ, స్థానిక హోటళ్ల గురించీ తెలుసుకోవచ్చు. గూగుల్‌ క్లౌడ్‌ స్ట్రీమ్‌ ద్వారా ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్లలోనూ పనిచేస్తుంది. 


అత్యవసర సేవల విస్తరణ

గూగుల్‌ ఇటీవల బల్గేరియా, పరాగ్వే, స్పెయిన్, సౌదీ అరేబియాలో ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీసెస్‌ (ఈఎల్‌ఎస్‌) ఆరంభించింది. ఇప్పుడు దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా మందికి విస్తరించాలని భావిస్తోంది. భూకంపాల గురించి హెచ్చరించే ఎర్లీ ఎర్త్‌క్వేక్‌ వార్నింగ్స్‌ సర్వీస్‌ ఇప్పటికే 25 దేశాల్లో అందుబాటులో ఉంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే చాలా ప్రాంతాల్లో ఈ సంవత్సరంలోనే దీన్ని ఆరంభించాలని చూస్తోంది. ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచీలకూ వర్తింపజేయనున్నారు. దీంతో విశ్వసనీయమైన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడిని వెంటనే కాంటాక్ట్‌ చేయటానికి వీలవుతుంది. లేదూ వాచీ నుంచే నేరుగా అత్యవసర సేవలకు కాల్‌ చేయొచ్చు.


దగ్గర్లో బిర్యానీ ఉందా?

మల్టీసెర్చ్‌ ఫీచర్‌ మరింత కొత్తగా ముస్తాబయ్యింది. గూగుల్‌ లెన్స్‌తో పనిచేసే మల్టీసెర్చ్‌ ఫీచర్‌ కెమెరా ఫోన్‌తో ఇమేజ్, అదే సమయంలో టెక్ట్స్‌ ద్వారా సెర్చ్‌ చేయటానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు దీనికి నియర్‌ మీ ఫీచర్‌నూ జోడించారు. దీంతో సెర్చ్‌ చేస్తే స్థానిక దుకాణాల్లో అందుబాటులో ఉన్న వస్తువులూ కనిపిస్తాయి. ఉదాహరణకు దగ్గర్లోని హోటల్‌లో బిర్యానీ ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని