వాయిస్‌ మర్యాదలు

ఫోన్‌ కాల్‌ చేయాలని అనిపించుకోవచ్చు. కానీ కాల్‌ చేస్తే ఎక్కువ సమయం పడుతుందేమో. పోనీ మెసేజ్‌ పంపిద్దామా అంటే టైప్‌ చేయటానికి అనువైన పరిస్థితి ఉండకపోవచ్చు. మరెలా? ఇలాంటి సమయాల్లోనే వాయిస్‌ మెసేజ్‌లు బాగా ఆదుకుంటాయి.

Updated : 05 Oct 2022 02:55 IST

ఫోన్‌ కాల్‌ చేయాలని అనిపించుకోవచ్చు. కానీ కాల్‌ చేస్తే ఎక్కువ సమయం పడుతుందేమో. పోనీ మెసేజ్‌ పంపిద్దామా అంటే టైప్‌ చేయటానికి అనువైన పరిస్థితి ఉండకపోవచ్చు. మరెలా? ఇలాంటి సమయాల్లోనే వాయిస్‌ మెసేజ్‌లు బాగా ఆదుకుంటాయి. వాట్సప్‌ వంటి చాలా సామాజిక మాధ్యమ యాప్‌లలో దీన్ని వాడుకుంటూనే ఉంటాం. మైక్రోఫోన్‌ గుర్తు మీద ట్యాప్‌ చేసి మాటలను రికార్డు చేసి పంపితే చాలు. ఇటు అటు నుంచి పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ కావటం వల్ల ఇవి సురక్షితం కూడా. అయితే వాయిస్‌ మెసేజ్‌ల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటి విషయంలో అధికారిక నియమాలేవీ లేవు గానీ కొన్ని మర్యాదలు పాటించటం ఎంతైనా మంచిది.

వీలైనంత చిన్నగా
టైప్‌ చేయాల్సిన అంశం ఎక్కువగా ఉన్నప్పుడు, తక్షణం కాల్‌ చేయాల్సినంత ముఖ్య విషయం కానప్పుడు వాయిస్‌ నోట్‌ బాగా ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. ఇది ఎంత నిడివి ఉండాలనేది ఆయా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటికీ ఒకే లెక్క సరిపోదు. కానీ ఎవరూ కూడా 10 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి గల వాయిస్‌ మెసేజ్‌లు, పాడ్‌కాస్ట్‌లను లౌడ్‌ స్పీకర్‌తో వినటానికి ఇష్టపడరు. ఒకవేళ వాయిస్‌ మెసేజ్‌ నిడివి మరీ ఎక్కువగా ఉన్నట్టయితే 1.5 లేదా 2 రెట్ల వేగంతో వినటం మంచిది.

పాడ్‌కాస్ట్‌లు పంపొద్దు
పెద్ద వాయిస్‌ నోట్లు వినటానికి మనకే కాదు, ఇతరులకూ కష్టంగానే ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ నిడివి గల వాయిస్‌ మెసేజ్‌లు ఎవరికీ పంపొద్దు. అంతగా అవసరమైతే విడివిడిగా చిన్న చిన్న మెసేజ్‌లు పంపించుకోవాలి. అన్నింటినీ ఒకేసారి వినటానికి.. లేదూ వీలున్నప్పుడు ఒకోటీ వినటానికి సౌకర్యంగా ఉంటుంది.

అవతలివారిని గౌరవించాలి
బహిరంగ ప్రదేశాల్లో ఇతరుల ఫోన్లలోని వాయిస్‌ మెసేజ్‌లను వినటానికి ఎవరూ ఇష్టపడరు. చుట్టుపక్కల వారికిది ఇబ్బంది కలిగిస్తుంది కూడా. పైగా ఏదైనా రహస్య విషయాలు, ఇతరులకు తెలియకూడని సమాచారమూ మెసేజ్‌లల్లో ఉండొచ్చు. ఇది మన గోప్యతకూ ముప్పు తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి ఎక్కువమంది ఉన్నచోట ఇలాంటి సందేశాలను వాల్యూమ్‌ పెంచి వినటం తగదు. ఒకవేళ వినాలనుకుంటే తక్కువ శబ్దంతో వినాలి. అందుబాటులో ఉంటే హెడ్‌ఫోన్స్‌ వాడుకుంటే ఇంకా మంచిది.

తక్కువగా ప్రశ్నించాలి
వాయిస్‌ నోట్‌లో మరీ ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తే వినేవారు తికమక పడొచ్చు. కొన్ని ప్రశ్నలను మరచిపోవచ్చు కూడా. అందువల్ల ఒక వాయిస్‌ మెసేజ్‌లో వీలైనంత తక్కువ ప్రశ్నలు ఉండేలా చూసుకోవాలి. అవతలి వారు తేలికగా జవాబు చెప్పటానికి అనువుగా ఉండాలని గుర్తుంచుకోవాలి.

జవాబు ఇవ్వాలి
వాయిస్‌ మెసేజ్‌ను అందుకున్నప్పుడు విధిగా జవాబు పంపటానికి ప్రయత్నించాలి. వాడే భాష మీద అప్రమత్తంగా ఉండాలి. అందుకున్న మెసేజ్‌లో వాడిన భాషలోనే జవాబు ఇస్తే మంచిది. అలాగే సమయమూ కీలకమే. అవతలివారు మన జవాబు కోసం వేచి చూడేలా, వారి సమయం వృథా అయ్యేలా చేయకూడదు. వీలైనంత వరకు వెంటనే జవాబివ్వాలి. అంత సమయం లేకపోతే హ్యాండ్స్‌-ఫ్రీ సదుపాయంతో మెసేజ్‌ పంపొచ్చు. మైక్రోఫోన్‌ మీద ట్యాప్‌ చేసి స్వైప్‌ చేస్తే చాలు. రికార్డింగ్‌ సమయం లాక్‌ అవుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని రికార్డు చేసి, సెండ్‌ బటన్‌ను నొక్కితే మెసేజ్‌ వెళ్లిపోతుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు