ఆరోగ్యానికి కొత్త మేధ!

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఏఐ.. పేరేదైనా మానవ జీవితాన్ని సులభతరం చేయటంలో పెద్ద ముందడుగు వేస్తోంది. శాస్త్రీయ పరిశోధనల అడ్డంకులు దాటుకొని జన సామాన్యం వాడుకునే స్థాయికీ చేరుకుంది. మనకు తెలియకుండానే మొబైల్‌ ఫోన్స్‌, ఇంటర్నెట్‌లో ఇప్పటికే దీన్ని వాడుకుంటున్నాం కూడా.

Updated : 12 Oct 2022 06:19 IST

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఏఐ.. పేరేదైనా మానవ జీవితాన్ని సులభతరం చేయటంలో పెద్ద ముందడుగు వేస్తోంది. శాస్త్రీయ పరిశోధనల అడ్డంకులు దాటుకొని జన సామాన్యం వాడుకునే స్థాయికీ చేరుకుంది. మనకు తెలియకుండానే మొబైల్‌ ఫోన్స్‌, ఇంటర్నెట్‌లో ఇప్పటికే దీన్ని వాడుకుంటున్నాం కూడా. పుంఖానుపుంఖంగా వెల్లువెత్తే సమాచారాన్ని చిటికెలో విడదీసి, విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందించే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి మెదడుతో పోటీ పడుతూ.. ఆ మాటకొస్తే మనిషి మెదడునే అధిగమిస్తూ లెక్కలేనన్ని పరిష్కారాలు చూపెడుతోంది. మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో తనకు తానే సవాళ్లు విసురుకుంటూ, వాటిని అధిగమిస్తూ.. కొత్త పరిష్కారాలను కనుక్కొంటూ, వాటి ద్వారా వినూత్న మార్గాలను గుర్తిస్తూ దూసుకుపోతోంది. అందుకేనేమో నిత్య నూతన సవాళ్లతో ముడిపడిన ఆరోగ్యరంగానికిది కొత్త ఆశా కిరణంగా కనిపిస్తోంది. జబ్బులను అంచనా వేయటం దగ్గర్నుంచి వాటిని నిర్ధరించటం వరకూ లెక్కలేనన్ని పనులు చేసి పెడుతోంది. ఇలా ల్యాబ్‌ టెక్నీషియన్లకు, డాక్టర్లకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. పొరపాట్లకు తావివ్వని చికిత్సల విషయంలోనూ అండగా నిలుస్తోంది.

రోగ్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. జబ్బుల నిర్ధరణలో మనుషులు చేసే పొరపాట్లకు కళ్లెం వేయటం.. వైద్య సేవలను మరింత వేగంగా, కచ్చితంగా అందించటం.. ఖరీదైన చికిత్సలను చవకగా మార్చి అందరికీ అందుబాటులోకి తేవటం వంటి వాటిని ఇప్పటికే అనుభవిస్తున్నాం. దీని ద్వారా స్కాన్లను చదవటం దగ్గర్నుంచి ముప్పులను అంచనా వేయటం వరకూ ఎన్నెన్నో అద్భుతాలు సుసాధ్యమవుతున్నాయి. మన మెదడు మాదిరిగా నేర్చుకోవటం, సమస్యలను పరిష్కరించటం, నిర్ణయాలు తీసుకునే గుణం ఉండటం.. అదీ అతి వేగంగా ఫలితాలు వెల్లడిస్తుండటమే కృత్రిమ మేధకు రోజురోజుకీ ఆదరణ పెరగటానికి కారణమవుతోంది. అదే సమయంలో మానవ మాత్రులకు సాధ్యం కాని విధంగా ఎదురైన అనుభవాలను గుదిగుచ్చి విశ్లేషించటం మరో ప్రత్యేకత. మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో అవ్యవస్థీకృత సమాచారాన్నయినా చిటికెలో విడమరచుకొని, మానవ ప్రమేయం లేకుండా తనకు తానే వినూత్న పరిష్కార మార్గాలను కనుక్కోవటం.. వాటిని ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచుకోవటం విశేషం. ఇదే ఆరోగ్యరంగంలో ఏఐ ప్రాధాన్యాన్ని పెంచుతోంది. ఉదాహరణకు- ఎక్స్‌రే లేదా ఎంఆర్‌ఐ స్కాన్లను విశ్లేషించే ఏఐ ఆధారిత వ్యవస్థనే చూడండి. లెక్కలేనన్ని స్కాన్లు, ఎక్స్‌రే చిత్రాలున్నా సరే. దీనిలోని అల్గారిథమ్‌ అత్యంత వేగంగా ప్రతి ఒక్క చిత్రాన్నీ పరిశీలిస్తూ.. వాటి నుంచి నేర్చుకుంటూ.. కచ్చితమైన అంచనాకు వస్తుంది. కొవిడ్‌-19 విజృంభణతో దీని వాడకం శరవేగంగా పుంజుకుంది కూడా. ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయో తెలుసుకోవటానికి ఆసుపత్రులు ఏఐ సాయం తీసుకోవటం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అంకుర సంస్థలు ఆరోగ్యరంగంలో ఏఐ వాడకం మీద దృష్టి సారించాయి. ఎన్నెన్నో అప్లికేషన్లు, వ్యవస్థల రూపకల్పనతో వైద్య సేవలను సులభతరం చేయటానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం దీని వాడకం మీద కన్నేశాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా విజృంభించే జబ్బులను గుర్తించటానికీ ఏఐ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) ఆరోగ్యానికి సంబంధించిన మీడియా కథనాలను స్కాన్‌ చేసే వ్యవస్థను రూపొందిస్తోంది. ఇది 33 రకాల జబ్బులకు సంబంధించిన డేటాను సంగ్రహిస్తుంది. వీటిని విశ్లేషించటం ద్వారా ఎక్కడెక్కడ, ఏయే జబ్బులు విజృంభిస్తున్నాయో తెలుసుకోవటం దీని ఉద్దేశం.


ఫ్లోరెన్స్‌- డిజిటల్‌ ఆరోగ్య కార్యకర్త

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల కృత్రిమ మేధ ఆధారిత ఛాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌ ఆరోగ్య కార్యకర్తగా పనిచేసే దీని పేరు ఫ్లోరెన్స్‌. విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ప్రజలకు అందించాలనేది దీని ఉద్దేశం. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏఐ విషయంలో అంతగా ముందుకు రాలేదు. ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ చూపుతున్న ప్రభావాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంగీకరించిందనటానికి ఫ్లోరెన్స్‌ ఆవిష్కరణ ఒక సంకేతమని భావిస్తున్నారు. నిజానికి న్యూజిలాండ్‌కు చెందిన సోల్‌ మెషిన్స్‌ సంస్థ ఖతార్‌ ఆరోగ్యశాఖ సాయంతో దీన్ని రూపొందించింది. కరోనా మహమ్మారిపై ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేయటానికి ఫ్లోరెన్స్‌ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడిది మరింత అధునాతనంగా మారి ఫ్లోరెన్స్‌ 2.0గా ముందుకొచ్చింది. కొవిడ్‌-19 టీకాలు, చికిత్సలకు సంబంధించి సలహాలు ఇవ్వటమే కాదు.. మానసిక ఆరోగ్యం గురించిన సందేహాలనూ తీరుస్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తినాలి? బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి? పొగతాగే అలవాటును ఎలా మానుకోవాలి? వంటి వాటిపై వివరంగా సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఛాట్‌బోట్‌ హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, చైనీస్‌, రష్యన్‌ భాషల్లో సంభాషణ సాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రది 8 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. పొగ అలవాటు, చెడు ఆహార అలవాట్లతో ఏటా 1.6 కోట్ల మంది మృత్యువాత పడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే క్యాన్సర్‌, గుండెజబ్బు, ఊపిరితిత్తుల జబ్బు, మధుమేహంతో సంభవిస్తున్న 8.30 లక్షల మరణాలను నివారించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫ్లోరెన్స్‌ వంటి డిజిటల్‌ ఆరోగ్య సలహా సేవలు మున్ముందు ప్రజారోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకురాగలవని ఆశిస్తున్నారు.


అడా: లక్షణాల తనిఖీ

శరీరం ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం గురించి సంకేతాలు అందిస్తూనే ఉంటుంది. వీటిని అర్థం చేసుకొని, మసలుకోగలిగితే ఎన్నో సమస్యలు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అందుకే అప్పుడప్పుడు ఆరోగ్యం ఎలా ఉందన్నది పరిశీలించుకోవటం ఎంతైనా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిందే అడా యాప్‌. డాక్టర్ల సూచనలు, సలహాలతోనే దీన్ని తయారుచేశారు. కృత్రిమ మేధ, డాక్టర్ల సమన్వయంతో పనిచేసే ఇది రకరకాల ప్రశ్నలు సంధిస్తూ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. ఆయా ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాల ఆధారంగా జబ్బును గుర్తిస్తుంది. ఉదాహరణకు గొంతునొప్పి వస్తుందా? అనే ప్రశ్నకు అవునని జవాబిస్తే.. మామూలు జలుబు దగ్గర్నుంచి అరుదైన సమస్యల వరకూ అన్నింటినీ పరిశీలించి, తిరిగి రకరకాల ప్రశ్నలు వేస్తుంది. చివరికి జబ్బును గుర్తిస్తుంది. అవసరమైతే డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌నూ తీసుకుంటుంది. అత్యవసర సమస్య అయితే ఎమెర్జెన్సీ గదికి వెళ్లమనీ చెబుతుంది.  


ఇన్‌స్టాఈసీజీ: గుండెజబ్బు విశ్లేషణ

దీన్ని ట్రైకాగ్‌ అనే సంస్థ రూపొందించింది. ఇది నిమిషాల్లోనే ఈసీజీ రిపోర్టులను విశ్లేషించి గుండె జబ్బును గుర్తిస్తుంది. అత్యవసర విభాగాల్లో చాలావరకు యువ వైద్యులు, హెడ్‌ నర్సులే ఉంటుంటారు. కొందరికి ఈసీజీ రిపోర్టులను కచ్చితంగా విశ్లేషించటం రాకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఇన్‌స్టాఈసీజీ ఉపయోగపడుతుంది. దీనిలోకి ఈసీజీ ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేస్తే చాలు. వెంటనే విశ్లేషించి సమస్య ఉందో లేదో గుర్తిస్తుంది. యాప్‌ రూపంలోనే కాదు, వెబ్‌సైట్‌ ద్వారానూ ఎవరైనా దీన్ని వినియోగించుకోవచ్చు. ఫోన్‌ నంబరును రిజిస్టర్‌ చేసుకొని, ఈసీజీ ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేస్తే 15 నిమిషాల్లోనే డాక్టర్‌ రిపోర్టు అందిస్తుంది.


నిరామయి: రొమ్ముక్యాన్సర్‌ దిక్సూచీ

మహిళల్లో క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణం రొమ్ముక్యాన్సర్‌. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం- ప్రతి 12 మందిలో ఒకరిలో రొమ్ముల్లో మార్పులు ఉంటున్నాయి. వీటిని తొలిదశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ మరణాలను చాలావరకు తగ్గించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బెంగళూరుకు చెందిన నిరామయి సంస్థ వినూత్న సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వైద్య పరికరాన్ని తయారుచేసింది. సంప్రదాయ, రొమ్ముల స్వీయ పరిశీలన  పద్ధతుల కన్నా ముందే రొమ్ముక్యాన్సర్‌ను పసిగట్టాలనేది దీని ఉద్దేశం. ఇది పేటెంట్‌ పొందిన మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ సాయంతో ఆటోమేటెడ్‌ పద్దతిలో కచ్చితంగా సమస్యను గుర్తిస్తుంది. రేడియేషన్‌ రహితంగా, చేత్తో తాకకుండా, ఎలా నొప్పి లేకుండా క్యాన్సర్‌ ఆనవాళ్లను పట్టుకోవటం దీని ప్రత్యేకత. అన్ని వయసుల మహిళలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. నిరామయిలో కీలకమైంది థెర్మాలైటిక్స్‌ అనే సొల్యూషన్‌. ఇది కంప్యూటర్‌ సాయంతో పనిచేసే డయాగ్నస్టిక్‌ పద్ధతి. కృత్రిమ మేధతో పనిచేస్తుంది. హై రెజల్యూషన్‌ థర్మల్‌ సెన్సింగ్‌ పరికరం, క్లౌడ్‌ అనలిటిక్స్‌ సొల్యూషన్‌తో థర్మల్‌ చిత్రాలను విశ్లేషిస్తుంది. మరింత మంచి విషయం ఏంటంటే- దీన్ని చేతిలో పట్టుకొని తీసుకెళ్లే వీలుండటం. అంటే పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చన్నమాట.


బ్రెయిన్‌సైట్‌ఏఐ: మెదడు దర్పణం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, న్యూరోసైన్స్‌ కలబోతతో పుట్టుకొచ్చిన పరిజ్ఞానం బ్రెయిన్‌సైట్‌ఏఐ. మెదడు కణితుల వంటి నాడీ సమస్యలను, మానసిక సమస్యలను కచ్చితంగా, త్వరగా గుర్తించటం దీని ప్రత్యేకత. కృత్రిమ మేధతో కూడిన ఫంక్షనల్‌ ఎంఆర్‌ఐ స్కాన్లతో మెదడులో చురుకుగా ఉండే భాగాలను గుర్తించటం ద్వారా ఇది సమస్యను అంచనా వేస్తుంది. మెదడులోని భాగాలు ఉత్తేజితమైనప్పుడు అక్కడికి రక్త సరఫరా పుంజుకుంటుంది. ఆ భాగం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది కూడా. సమస్య గల భాగాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. మెదడును స్కాన్‌ చేసినప్పుడు ఇలాంటి స్థితిని గుర్తిస్తే, ఈ పరికరం ఇతర స్కాన్‌ చిత్రాలతో పోల్చి చూసి సమస్యను గుర్తిస్తుంది. మెదడులో కణితుల వంటివి ఉన్నాయేమో అంచనా వేస్తుంది. ఇలా సర్జన్లకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.


ఏఐ100: వినూత్న సూక్ష్మదర్శిని

ఇదో ఆటోమేటెడ్‌ డిజిటల్‌ మైక్రోస్కోప్‌. త్వరగా, తేలికగా రక్త పరీక్షల వంటివి చేయటానికిది వీలు కల్పిస్తుంది. దీన్ని సిగ్‌ టపుల్‌ అనే సంస్థ రూపొందించింది. గాజు ఫలకల మీద చిన్న రక్తం చుక్క వేసి, ఇందులో పెడితే చాలు. మోనోలేయర్‌ ద్వారా హై రెజల్యూషన్‌ చిత్రాలను తీసుకుంటుంది. అధునాతన కృత్రిమ మేధ వీటిని విశ్లేషించి ఆయా రకాలుగా రక్త కణాలను విడదీస్తుంది. వాటి సంఖ్యను లెక్కిస్తుంది. నిమిషాల్లోనే ఫలితాలను చూపిస్తుంది. ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ఏ పరికరానికైనా వాటిని పంపిస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా వీటిని చూసుకోవచ్చన్నమాట. దీంతో ల్యాబ్‌ టెక్నీషియన్లు కూడా ఇంటి నుంచే పనిచేయటానికి మార్గం సుగమమవుతుంది. దగ్గర మైక్రోస్కోప్‌ లేకపోయినా అక్కడ్నుంచే రక్త నమూనాలను విశ్లేషించొచ్చు. ఆసుపత్రుల్లోనే కాదు, బోధనకూ దీన్ని వాడుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని