నిద్రకూ వాతావరణ మార్పు దెబ్బ!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పర్యావరణం మీదే కాదు.. మన శరీరం మీదా ప్రభావం చూపుతున్నాయి. ఇవి మన నిద్రనూ కొల్ల గొడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరికి వారానికి గంట నిద్రను కోల్పోవటం ఖాయం!

Updated : 21 Sep 2022 04:39 IST

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పర్యావరణం మీదే కాదు.. మన శరీరం మీదా ప్రభావం చూపుతున్నాయి. ఇవి మన నిద్రనూ కొల్ల గొడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరికి వారానికి గంట నిద్రను కోల్పోవటం ఖాయం!

రాత్రిపూట మనం నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు మన శరీరం రక్తనాళాలను విప్పార్చటం, కాళ్లు చేతులకు ఎక్కువ రక్తాన్ని ప్రసరింపజేయటం ద్వారా చుట్టుపక్కల వాతావరణంలోకి వేడిని వెదజల్లుతుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి శరీర ఉష్ణోగ్రత కన్నా పరిసరాల వాతావరణం చల్లగా ఉండటం అత్యవసరం. లేకపోతే నిద్ర దెబ్బతింటుంది.

వాతావరణ మార్పుతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటి పర్యవసానాలను ఇప్పటికే చవి చూస్తున్నాం. అకాల వర్షాలు, కరవులతో ప్రపంచం అతలా కుతలమవుతోంది. అధిక ఉష్ణోగ్రతల మూలంగా నిద్ర కూడా దెబ్బతింటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగెన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఈ ధోరణి మారనట్టయితే 2099 కల్లా మనం ఏడాదికి 50-58 గంటల నిద్రను కోల్పోతామని హెచ్చరిస్తోంది. అంటే వారానికి సుమారు గంట నిద్రకు దూరమవుతామన్నమాట. నిద్రించే సమయాన్ని లెక్కించటానికి పరిశోధకులు యాక్సిలరోమీటర్‌ ఆధారిత స్లీప్‌-ట్రాకింగ్‌ మణికట్టు బ్యాండులను ఉపయోగించుకున్నారు. ఇవి ఎవరికివారు స్వయంగా చెప్పే నిద్ర, మెలకువల సమాచారంతో దాదాపు సమానంగా ఫలితాలు చూపిస్తున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది. అందుకే వీటి సాయంతో అన్ని ఖండాల్లో (అంటార్కిటికా తప్ప) 68 దేశాలకు చెందిన 47వేల మంది నిద్ర రికార్డులను పరిశీలించారు. చుట్టుపక్కల ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు సగటున 14 నిమిషాలు తక్కువగా నిద్రపోయినట్టు గుర్తించారు. పెద్దవారికి రాత్రిపూట కనీసం 7 గంటల నిద్ర అవసరమన్నది నిపుణుల సిఫారసు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు దీని కన్నా తక్కువసేపు నిద్రపోతున్నామని తేలింది. ‘‘సగటు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు మనుషుల నిద్రను కొల్లగొడుతున్నట్టు మా అధ్యయనంలో తొలిసారి రుజువైంది. వేడి వాతావరణంలో నిద్ర ఆలస్యంగా పట్టటం, త్వరగా మేలుకోవటం దీనికి ప్రధాన కారణాలని మేం నిరూపించాం’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన కెల్టన్‌ మైనర్‌ చెబుతున్నారు. వృద్ధులు, మహిళలతో పాటు అల్పాదాయ దేశాల్లో నివసించేవారి మీద దీని ప్రభావం మరింత ఎక్కువగానూ ఉంటోందని వివరిస్తున్నారు. తాజా అధ్యయన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో.. ముఖ్యంగా వేడి ప్రాంతాల్లో, పేద దేశాల్లో నివసించేవారి నుంచి సమాచారాన్ని సేకరించాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. సరైన పర్యావరణ విధాన నిర్ణయాలను తీసుకోవటానికి మున్ముందు వాతావరణ ప్రభావాలను విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని