పాస్‌వర్డ్‌ పోయి పాస్‌కీలొచ్చె..

పాస్‌కీ. పాస్‌వర్డ్‌లకు బదులుగా ఉపయోగపడే డిజిటల్‌ ధ్రువీకరణ సాధనం. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను గానీ అదనపు ధ్రువీకరణను గానీ ఎంటర్‌ చేయకుండానే వెబ్‌సైట్‌ ఖాతాలోకి వెళ్లటానికిది వీలు కల్పిస్తుంది.

Published : 19 Oct 2022 00:30 IST

ఎన్నెన్నో వెబ్‌సైట్లు. ఎన్నెన్నో ఖాతాలు. అన్నింటికీ యూజర్‌ నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు. వీటిని గుర్తుంచుకోవటమంటే మాటలా? మరచిపోయిన ప్రతీసారీ కొత్తవి సృష్టించుకోవటం. కొన్నిసార్లు ఇదో పెద్ద ప్రహసనంలా అనిపిస్తుంటుంది. చిరాకు తెప్పిస్తుంది. అందుకే బడా టెక్‌ సంస్థలు పాస్‌వర్డ్‌లు లేని అంతర్జాల ప్రపంచం వైపు దృష్టి సారిస్తున్నాయి. యాపిల్‌ ఇప్పటికే ఐఓఎస్‌ 16 అప్‌డేట్‌తో పాస్‌వర్డ్‌లకు ప్రత్యామ్నాయంగా పాస్‌కీలను పరిచయం చేసింది. తాజాగా గూగుల్‌ కూడా డెవలపర్లకు ఆండ్రాయిడ్‌, క్రోమ్‌లలో పాస్‌కీ సపోర్టును ప్రకటించింది. పాస్‌వర్డ్‌లకు సురక్షిత ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పాస్‌కీల సంగతేంటి?

పాస్‌కీ. పాస్‌వర్డ్‌లకు బదులుగా ఉపయోగపడే డిజిటల్‌ ధ్రువీకరణ సాధనం. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను గానీ అదనపు ధ్రువీకరణను గానీ ఎంటర్‌ చేయకుండానే వెబ్‌సైట్‌ ఖాతాలోకి వెళ్లటానికిది వీలు కల్పిస్తుంది. ఇది యూజర్‌ ఖాతా.. వెబ్‌సైట్‌ లేదా అప్లికేషన్‌తో నేరుగా అనుసంధానమై ఉంటుంది. కాబట్టే పాస్‌వర్డ్‌లకు ఇది తేలికైన, సురక్షిత ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు. ఫింగర్‌ప్రింట్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి బయోమెట్రిక్‌ సెన్సర్‌.. పిన్‌ లేదా ప్యాటర్న్‌లతో సైన్‌ ఇన్‌ కావొచ్చు. దీంతో పాస్‌వర్డ్‌లను మేనేజ్‌ చేయటం తప్పుతుంది. ఆటోఫిల్లింగ్‌ పాస్‌వర్డ్‌ ఫామ్‌ మాదిరిగానే ఇదీ చాలా తేలికైందని గూగుల్‌ చెబుతోంది.

ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
పాస్‌కీని సృష్టించుకోవాలంటే ముందుగా ఆయా వెబ్‌సైట్లు, యాప్‌లలో రిజిస్టర్‌ అయ్యిండాలి. తర్వాత వాటిల్లోకి సైన్‌ ఇన్‌ అయ్యేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి.
* అప్లికేషన్‌/వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
* అనంతరం పాస్‌కీని ఎంచుకోవాలి.
* పరికరం స్క్రీన్‌ అన్‌లాక్‌ సాయంతో లాగిన్‌ ప్రక్రియను పూర్తిచేయాలి.
* ప్రస్తుతానికిది డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటులోకి రావటానికి కొంత సమయం పడుతుందని గుర్తించాలి.

వివిధ పరికరాలతో సింక్రనైజ్‌
పాస్‌కీలు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వంటి ఏదో ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు పరిమితం కాకపోవటం గమనార్హం. ఫోన్‌లో స్టోర్‌ అయిన పాస్‌కీలను ల్యాప్‌టాప్‌లో లాగిన్‌ అయ్యేటప్పుడూ వాడుకోవచ్చు. ఆయా పాస్‌కీలు ల్యాప్‌టాప్‌తో సింక్రనైజ్‌ కావాల్సిన అవసరమూ ఉండదు. ఇందుకోసం ల్యాప్‌టాప్‌కు దగ్గరగా ఫోన్‌ ఉంటే చాలు. ఫోన్‌లో సైన్‌ఇన్‌ను అప్రూవ్‌ చేస్తే ల్యాప్‌టాప్‌లోనూ ఆయా వెబ్‌సైట్లలో లాగిన్‌ కావొచ్చు. ఉదాహరణకు- క్రోమ్‌బుక్‌ మీద ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లారనుకోండి. అప్పటికే ఐఓఎస్‌ పరికరం మీద ఆ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి, పాస్‌కీని సృష్టించుకొని ఉన్నారనుకోండి. క్రోమ్‌బుక్‌లో అదే పాస్‌కీతో లాగిన్‌ కావొచ్చు. ఐఓఎస్‌ పరికరంలో పాస్‌కీని అప్రూవ్‌ చేస్తే సరిపోతుంది. ఆండ్రాయిడ్‌ పరికరంలోని క్రోమ్‌లో పాస్‌కీలు గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌లో స్టోర్‌ అవుతాయి. ఒకే గూగుల్‌ ఖాతాతో సైన్‌ ఇన్‌ అయిన ఆండ్రాయిడ్‌ పరికరాల మధ్య పాస్‌కీలు సింక్రనైజ్‌ అవుతాయి.

ఎంతవరకు సురక్షితం?
పాస్‌కీలు చాలా సురక్షితమని గూగుల్‌ చెబుతోంది. ఫిషింగ్‌ దాడుల నుంచి బాగా కాపాడతాయని వివరిస్తోంది. పాస్‌కీలు ప్రామాణికమైనవి కావటం వల్ల ఒకసారి వాడుకోవటం ఆరంభిస్తే వివిధ బ్రౌజర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో పాస్‌వర్డ్‌ రహిత అనుభవాన్ని పొందొచ్చు. పైగా పాస్‌కీలు పబ్లిక్‌ క్రిప్టోగ్రఫీని వాడుకుంటాయి. అందువల్ల డేటా ఉల్లంఘన ముప్పూ తగ్గుతుంది. మనం ఏదైనా వెబ్‌సైట్‌ లేదా యాప్‌తో పాస్‌కీని సృష్టించుకున్నప్పుడు ఇది మన పరికరంలో పబ్లిక్‌-ప్రైవేట్‌ కీ జతను జెనరేట్‌ చేస్తుంది. పబ్లిక్‌ కీ మాత్రమే సైట్‌లో స్టోర్‌ అవుతుంది. ఇది అటాకర్లకు ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే ప్రైవేట్‌ కీతో జత కలిస్తేనే ధ్రువీకరణ పూర్తవుతుంది. సర్వర్‌లో స్టోర్‌ అయిన డేటా నుంచి ప్రైవేట్‌ కీని అటాకర్లు తీసుకోలేరు. ఒకవేళ ఫోన్‌ పోయినా కూడా అందులో, పీసీలో స్టోర్‌ అయిన పాస్‌కీలు క్లౌడ్‌ ద్వారా అనుసంధానమవుతాయి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని