గోప్యంగా పంపేయండి..

ఎవరి కంటా పడకుండా వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా దాచుకుంటాం. వాటిల్లో ముఖ్యమైనవి బ్యాంకింగ్‌ వివరాలు, నెట్టింట్లోని లాగిన్‌ తాళాలు.. లాంటి ఇతర కూడా సమాచారం ఉంటుంది. వీటిని పక్కనే...

Published : 18 Mar 2021 12:29 IST

పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం

ఎవరి కంటా పడకుండా వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా దాచుకుంటాం. వాటిల్లో ముఖ్యమైనవి బ్యాంకింగ్‌ వివరాలు, నెట్టింట్లోని లాగిన్‌ తాళాలు.. లాంటి ఇతర సమాచారం కూడా ఉంటుంది. వీటిని పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్నవారితో పంచుకోవాలంటేనే ఆలోచించాలి. ఏదో సింపుల్‌గా వాట్సాప్‌లోనో.. టెక్స్ట్‌ మెసేజ్‌ రూపంలో పంపేస్తామంటే సురక్షితంగా కాదు. ఎందుకంటే.. హ్యాకర్లు ఎప్పుడూ కాపేసుకుని.. కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు నెట్టింట్లో భద్రంగా వ్యక్తిగత సమాచారాన్ని పంపేందుకు ఏంటి మార్గం? అదీ ఉచితంగా.! అందుకోసమే ‘బిట్‌వార్డెన్‌’ ఉంది. దీంతో టెక్స్ట్, ఇతర ఫైల్స్‌ని ఎన్‌క్రిప్ట్‌ చేసి పంపొచ్చు. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!

పాస్‌వర్డ్‌ మేనేజర్‌ మాత్రమే కాదు..

నెటిజన్లకు వన్‌పాస్‌వర్డ్, లాస్ట్‌పాస్‌ మాదిరిగానే బిట్‌వార్డెన్‌ కూడా చక్కని పాస్‌వర్డ్‌ మేనేజర్‌గా తెలిసి ఉండొచ్చు. ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీలో ఎక్కువ మంది యూజర్లు లాగిన్‌ తాళాల్ని భద్రం చేసేందుకు వాడుతున్నారు. ఉచిత అకౌంట్‌తోనే కాకుండా.. ప్రీమియం సర్వీసుగా పలు ఫీచర్లను పాస్‌వర్డ్‌ మేనేజర్‌లో అందిస్తూ నెట్టింట్లో ప్రయాణాన్ని సురక్షితం చేస్తోంది. దీంతో పాటు సమాచారాన్ని పంపేందుకు సేఫ్‌ ప్రొటోకాల్‌ని సిద్ధం చేసింది కూడా. అదే ‘బిట్‌వార్డెన్‌ సెండ్‌’. సులువైన ఇంటర్ఫేస్‌తో వ్యక్తిగత సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి పంపొచ్చు. అందుకు సైట్‌లోకి వెళ్లి ఉచిత అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత పంపాలనుకునే సమాచారాన్ని టెక్స్ట్‌ రూపంలో ఎంటర్‌ చేసి ఎన్‌క్రిప్ట్‌ చేసి పంపొచ్చు. ఎండ్‌-టూ-ఎండ్‌ 256బిట్‌ ఎన్‌క్రిప్షన్‌లో డేటాని భద్రం సేఫ్‌గార్డ్‌ చేస్తుంది. అంతేకాదు.. పంపిన ఫైల్‌ని నిర్ణీత సమయం తర్వాత డిలీట్‌ చేయొచ్చు కూడా. అందుకు ‘ఆటోమేటిక్‌ డిలీట్‌’ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. దీంట్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. మీరు ఎవరికైతే డేటాను పంపుతున్నారో వారు బిట్‌వార్డెన్‌లో సభ్యులు కానక్కర్లేదు. ప్రత్యేక లింక్‌ రూపంలో వచ్చిన ఎన్‌క్రిప్ట్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని చూడొచ్చు. అయితే, ఫ్రీ వెర్షన్‌లో కేవలం టెక్స్ట్‌ని మాత్రమే పంపే వీలుంది. ఒకవేళ మీరు ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్‌ అయితే ఫైల్స్‌ని కూడా ఎటాచ్‌ చేసి పంపొచ్చు. బిట్‌వార్డెన్‌ను వెబ్‌ సర్వీసుగానే కాకుండా బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌గా జత చేసుకుని కూడా వాడుకోవచ్చు.

ఇలా పంపేయండి..

సర్వీసులు రిజిస్టర్‌ అయ్యాక ‘సెండ్‌’ విభాగాన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత ‘క్రియేట్‌ న్యూ సెండ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేసి, పంపుతున్న టెక్స్ట్‌కి ఓ పేరుని పెట్టాలి. తర్వాత మీరు పంపేది మేటర్‌ మాత్రమే అయితే ‘టెక్స్ట్‌’ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. వచ్చిన బాక్స్‌లో మొత్తం సమాచారాన్ని టైప్‌ చేయాలి. తర్వాత ప్రత్యేక వెబ్‌ లింక్‌ రూపంలో డేటాని పంపొచ్చు. లింక్‌ని క్రియేట్‌ చేయడానికి ముందే.. ఎక్స్‌ట్రా సెక్యూరిటీ వలయాల్ని పెట్టుకోవచ్చు. అంటే.. పంపిన సమాచారం ఎన్ని రోజుల తర్వాత డిలీట్‌ అవ్వాలో సెట్‌ చేసుకోవచ్చు. గంటలు, రోజుల్లో తొలగిపోయేలా చేయొచ్చు. నెల రోజుల పరిధిలో ఆటో డిలీట్‌ని సెట్‌ చేసుకునే వీలుంది. ఇంకా చెప్పాలంటే.. ఎన్ని సార్లు ఫైల్‌ని యాక్సెస్‌ చెయ్యాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. ఉదాహరణకు రెండు సార్లు ఫైల్‌ని యాక్సెస్‌ చేశాక.. లింక్‌ని డిసేబుల్‌ అయ్యేలా చేయొచ్చు. 

* ఇతర వివరాలకు http://bit.ly/3qZr0A1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని