Windows 10: విండోస్‌ 10 వాడుతున్నారా..?అయితే ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

విండోస్‌ 10లో కొన్ని సెట్టింగ్స్‌ డీఫాల్ట్‌గా వస్తాయి. వాటి కారణంగా కంప్యూటర్‌ పనితీరును నెమ్మదిస్తుంది. అందుకే వాటిని డిసేబుల్ చేసుకోమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఏంటా సెట్టింగ్స్‌..? వాటిని ఎలా డిసేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం... 

Published : 03 Jul 2022 14:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కొత్త ఓఎస్‌ విండోస్‌ 11ను గతేడాది అక్టోబరులో విడుదల చేసింది. అయితే ఈ ఓఎస్‌ ఉపయోగించాలంటే కంప్యూటర్లలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉండి తీరాలని చెప్పుకొచ్చింది. దీంతో చాలా వరకు పాత కంప్యూటర్లు విండోస్‌ 10 ఓఎస్‌నే ఉపయోగిస్తున్నాయి. అయితే విండోస్‌ 10లో కొన్ని సెట్టింగ్స్‌ డీఫాల్ట్‌గా వస్తాయి. వాటి కారణంగా కంప్యూటర్‌ పనితీరు నెమ్మదిస్తుంది. అంతేకాకుండా అనవసరపు ప్రకటనలు, నోటిఫికేషన్లను యూజర్లకు పంపుతుంటాయి. అందుకే విండోస్‌ 10 ఉపయోగించే యూజర్లు వాటిని డిసేబుల్ చేసుకోమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఏంటా సెట్టింగ్స్‌..? వాటిని ఎలా డిసేబుల్ చేసుకోవాలో తెలుసుకుందామా..?

నోటిఫికేషన్స్‌ వద్దనుకుంటే..

సీరియస్‌గా పనిచేసుకుంటుంటే టిప్స్‌, యాప్‌ అప్‌డేట్స్‌, రిమైండర్స్‌ అంటూ డెస్క్‌టాప్‌ నోటిఫికేషన్స్‌ వస్తుంటాయి. అలా వరుసగా వచ్చే నోటిఫికేషన్లు విసుగుపుట్టిస్తుంటాయి. వాటికి చెక్‌ పెట్టాలంటే సెట్టింగ్స్‌ (Settings) > సిస్టమ్‌ (System) > నోటిఫికేషన్స్‌ అండ్‌ యాక్షన్స్‌ (Notifications & Actions) > నోటిఫికేషన్స్‌ (Notifications) సెక్షన్‌ కింద ఉన్న అన్ని ఆప్షన్స్‌ను డిసేబుల్ చేస్తే సరిపోతుంది. దీంతో ఇకపై స్క్రీన్‌ మీద ఎలాంటి నోటిఫికేషన్లు కనిపించవు. 

అప్‌డేట్ షేరింగ్‌కు నో 

విండోస్‌ 10 ఆప్టిమైజ్‌డ్‌ అప్‌డేట్‌ డెలివరీ సిస్టమ్‌ (Optimized Update Delivery System) అనే ఫీచర్‌తో ఇంటర్నెట్‌ ద్వారా ఇతర విండోస్‌ 10 యూజర్ల నుంచి అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే మీ కంప్యూటర్‌ కూడా ఇతరులకు అప్‌డేట్‌ షేరింగ్‌ హబ్‌గా పనిచేస్తుంది. ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కంప్యూటర్‌ సెట్టింగ్స్‌ (Settings) > అప్‌డేట్ అండ్ సెక్యూరిటీ (Update and Security) > అడ్వాన్స్‌ ఆప్షన్స్‌ (Advance Options) > డెలివరీ ఆప్టిమైజేషన్‌ (Delivery Optimization) > అలో డౌన్‌లోడ్స్‌ ఫ్రమ్‌ అథర్‌ పీసీ (Allow downloads from other PCs) అనే ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇతర కంప్యూటర్ల నుంచి మీకు అప్‌డేట్‌ షేరింగ్ ఆగిపోవడంతోపాటు, మీ కంప్యూటర్‌ నుంచి కూడా ఇతరులకు అప్‌డేట్‌లు వెళ్లవు. 

స్టార్ట్‌ మెనూ అండర్ కంట్రోల్‌

కొన్నిసార్లు కంప్యూటర్‌ ఓపెన్‌ చేసి స్టార్ట్ మెనూపై క్లిక్ చేస్తే ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త యాప్‌లు కనిపిస్తుంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేయకపోయినా.. మన కంప్యూటర్‌లోకి ఎలా వచ్చాయా అని ఆందోళన చెందుతుంటాం. వీటిని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ యూజర్‌ ప్రమేయం లేకుండా విండోస్‌ స్టోర్‌ నుంచి అప్‌డేట్ చేస్తుంది. నిజానికి ఇవి యాప్స్‌ కాదు ప్రకటనలు అని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇలాంటివి అప్‌డేట్ కాకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌ (Srttings) > పర్సనలైజేషన్‌ (Personalization) > స్టార్ట్‌ (Start) > షో సజిషన్స్‌ అకేషనల్లీ ఇన్‌ స్టార్ట్‌ (Show Suggestions Occasionally in Start) అనే ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. అలా యూజర్ ప్రమేయం లేకుండా మైక్రోసాఫ్ట్ పంపే యాప్స్‌కు చెక్ పెట్టేయొచ్చు. 

బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌

విండోస్‌ 10లో డీఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో రకాల యాప్స్‌ పనిచేస్తుంటాయి. ఇవి సమాచార అందుకోవడంతోపాటు, నోటిఫికేషన్లు పంపడం, అప్‌డేట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేయడం వంటివి చేస్తుంటాయి. దీనివల్ల యూజర్‌ ఉపయోగించని యాప్స్‌ కూడా కంప్యూటర్‌లోకి వచ్చి చేరడంతోపాటు, ల్యాప్‌టాప్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గిపోతుటుంది. అందుకే ఈ బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను డిసేబుల్‌ చేసుకోవడం ఉత్తమం. సెట్టింగ్స్‌ (Settings) > ప్రైవసీ (Privacy) > బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ (Background Apps) > లెట్ యాప్స్‌ ఆన్‌ ఇన్‌ ది బ్యాక్‌గ్రౌండ్‌ (Let apps run in the background) ఆప్షన్‌ను డిసేబుల్‌ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి యాప్‌లు రన్‌ కావు. 

థర్డ్‌పార్టీ యాప్స్‌ చెక్‌ పెట్టేయండిలా..

వెబ్‌ విహారంలో యూజర్‌ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా ఆన్‌లైన్‌ ప్రటనలు కనిపిస్తుంటాయి. ఈ ఆన్‌లైన్‌ ప్రకటనలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతి యూజర్‌కు ప్రత్యేకమైన అడ్వర్‌టైజింగ్ ఐడీని కేటాయిస్తుంది. ఈ ఐడీని మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ స్టోర్‌లోని కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌తో షేర్‌ చేసుకుంటుంది. ఒకవేళ విండోస్‌ మీ ఐడీని షేర్‌ చేసుకోకూడదంటే సెట్టింగ్స్‌ (Settings) > జనరల్‌ (General) > అడ్వర్‌టైజింగ్ ఐడీ (Let apps use adverting ID to make ads more interesting to you based on your app activity) అనే ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి. తర్వాత మీ ఐడీ రీసెట్‌ అవుతుంది.

డేటా సింక్‌ కాకూడదంటే..

విండోస్‌ 10లో ఉపయోగించే  యూజర్‌ ఐడీతో ఇతర డివైజ్‌లలో లాగిన్‌ అయినప్పుడు యూజర్‌కు సంబంధించిన సమాచారం (ఉదా: సిస్టమ్‌ సెట్టింగ్స్‌, థీమ్స్‌, పాస్‌వర్డ్స్‌, సెర్చ్‌ హిస్టరీ) సింక్‌ అవుతాయి. దానివల్ల యూజర్‌ పని సులభవుతుంది. ఒకవేళ గోప్యత కోసం ఈ సమాచారం ఇతర డివైజ్‌లలో షేర్‌ కాకూదనుకుంటే సెట్టింగ్స్‌ (Settings) > అకౌంట్స్‌ (Accounts) > సింక్‌ యువర్ సెట్టింగ్స్‌ (Sync Your Settings) ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. దాంతో ఒకే యూజర్‌ ఐడీతో లాగిన్‌ అయినా డేటా మాత్రం డివైజ్‌లలో సింక్‌ కాదు. 

కొర్టానాకు బై బై

మైక్రోసాఫ్ట్ వర్చువల్‌ అసిస్టెంట్ కొర్టానా గురించి తెలిసిందే. అయితే ఇది కూడా యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తుందంటున్నారు టెక్‌ నిపుణులు. యూజర్‌ మాట్లాడే విధానం, చేతిరాత, టైపింగ్ హిస్టరీ వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుందట. చాలా మంది యూజర్లు దీని గురించి పెద్దగా ఆలోచించరు. టెక్‌ నిపుణులు మాత్రం ఈ డేటా సేకరణను కూడా ఆపడం మేలంటున్నారు. ఇందుకోసం యూజర్లు సెట్టింగ్స్‌ (Settings) > ప్రైవసీ (Privacy) > లింకింగ్‌ అండ్ టైపింగ్‌ (Linking & Typing) ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని