MWC 2021 : టెక్‌ పండగ వస్తోంది.. ఏం తెస్తుందో?

Mobile World Congress 2021కి అంతా సిద్ధం... 

Published : 28 Jun 2021 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త కొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్ల, సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏటా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) నిర్వహిస్తుంటారు. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది ఈ మొబైళ్ల పండగ జరగలేదు. ఈ ఏడాది వర్చువల్‌లో నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (జూన్‌ 28) మధ్యాహ్నం నుంచి జులై 1 వరకు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతుంది. అక్కడ ఈ ఏడాది పరిచయం చేయబోయే అంశాల గురించి మీరూ చదివేయండి!

MWC అంటే ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థలు,  టెక్‌ కంపెనీలు ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. గూగుల్‌, నోకియా, షావోమి, ఫేస్‌బుక్‌, సోనీ లాంటి సంస్థలు హాజరు కావడం లేదు. 

ఈ ఏడాది  MWCలో టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో స్పేస్‌ఎక్స్‌ చీఫ్‌  ఎలాన్‌ మస్క్‌ కీనోట్‌. ఇంటర్నెట్‌ శాటిలైట్‌ ప్రాజెక్టు స్టార్‌లింక్‌ గురించి ఆయన ఈ వర్చువల్‌ ఈవెంట్‌లో మాట్లాడనున్నారు. ఆయనేం చెబుతారనే విషయంలో చాలా ఆసక్తి నెలకొంది. 

శాంసంగ్‌ నుంచి ఈ ఏడాది కొత్తగా మొబైల్స్‌ ఏవీ ఈ ఈవెంట్‌లో తీసుకురాకపోవచ్చని తెలుస్తోంది. శాంసంగ్‌ స్మార్ట్‌ వాచ్‌ల సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ వాచ్‌ 4ను తీసుకురాబోతోంది. దానినే ఈ  ఈవెంట్‌లో ప్రదర్శిస్తారని సమాచారం. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5జీ విభాగాల్లో కొత్త ఉత్పత్తులు, సాంకేతికతకు సంబంధించిన కొత్త ఉత్పత్తులను ఇంటెల్‌  MWCలో ఆవిష్కరించబోతోందని తెలుస్తోంది. 

లెనోవో నుంచి కొన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు, క్రోమ్‌బుక్స్‌, కంప్యూటర్లకు సంబంధించిన యాక్సెసరీలను ఈ ఈవెంట్‌లో  పరిచయం చేయబోతున్నారట.  థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 ఎక్స్‌ట్రీమ్‌ జెన్‌ 4, థింక్‌ప్యాడ్‌ ఎల్‌ 13 జెన్‌ 2, ఎల్‌ 13 యోగా జెన్‌ 2, ఐడియా ప్యాడ్ 5ఐ క్రోమ్‌ బుక్‌, ఐడియా ప్యాడ్‌ ఫ్లెక్స్‌ 5ఐ క్రోమ్‌ బుక్‌ 2 ఇన్‌ 1, లెనోవో గో పీసీ యాక్సెసరీలు ప్రదర్శిస్తారట. 

టీసీఎల్‌ నుంచి నెక్స్ట్‌వేర్‌ G పేరుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ  గ్లాసెస్‌లో చిన్నపాటి స్పీకర్లు కూడా ఉన్నాయట. ఇందులో మైక్రో ఓఎల్‌ఈడీ స్క్రీన్లు ఉంటాయి. 

MWCలో  డీలింక్‌ కూడా కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనుంది. 5జీ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌, క్లౌడ్‌ మేనేజ్‌డ్‌ క్యాంపస్‌ నెట్‌వర్క్స్‌, ఎస్‌ఎంబీ నెట్‌వర్క్స్‌, స్మార్ట్‌ హోం నెట్‌వర్క్స్‌ను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారని సమాచారం. 

తమ కొత్త 5జీ ప్లాట్‌ఫామ్స్‌ గురించి వేదికపై వివరించడానికి ఎన్‌విడియా కూడా సిద్ధమవుతోంది. ఇటీవల రూపొందించిన ఆసక్తికరమైన 5జీ నెట్‌వర్క్‌ ఉత్పత్తుల గురించి వివరిస్తారట. 

హువావే నుంచి ఈ ఏడాది మరో కొత్త ఫోల్డబుల్‌ మొబైల్‌ను MWCలో వివరిస్తారని వార్తలొస్తున్నాయి. పీ50 రేంజిలో ఈ మొబైల్‌ ఉంటుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని