12 ఏళ్ల వాట్సాప్..12 ఆసక్తికర ఫీచర్స్..!

200కోట్ల మంది యూజర్స్‌..ఒక రోజుకి వంద కోట్ల కాల్స్‌..నెలకి పది వేల కోట్ల మెసేజ్‌లు, ఇది క్లుప్తంగా వాట్సాప్ గురించిన సమాచారం. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ ఇన్‌స్టా మేసేజింగ్ యాప్ ఈ ఏడాదితో 12 వసంతాలు పూర్తి చేసుకుంది.... 

Published : 25 Feb 2021 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 200కోట్ల మంది యూజర్స్‌..ఒక రోజుకి వంద కోట్ల కాల్స్‌..నెలకి పది వేల కోట్ల మెసేజ్‌లు, ఇది క్లుప్తంగా వాట్సాప్ గురించిన సమాచారం. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ ఇన్‌స్టా మేసేజింగ్ యాప్ ఈ ఏడాదితో 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ గురించిన ఆసక్తికర విషయాలతో పాటు ఈ యాప్‌లోని ఆకర్షణీయమైన‌, భవి ష్యత్తులో అందుబాటులోకి రాబోయే 12 ఫీచర్స్ గురించిన సమాచారం..మీ కోసం


స్టేటస్‌ & స్టేటస్ షేరింగ్ 

12 సంవత్సరాల క్రితం అంటే 2009 సంవత్సరంలో ‘ప్రొఫైల్‌ స్టేటస్’ షేరింగ్ యాప్‌గా వాట్సాప్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అందులో యూజర్స్ తమ గురించి సమాచారాన్ని, తమలోని భావాలను అక్షరాల రూపంలో డిస్‌ప్లే చేసుకునేవారు. తర్వాతి కాలంలో యూజర్ అభ్యర్ధన మేరకు ‘స్టేటస్’ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందులో యూజర్స్ తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ మెసేజ్‌లు, యూఆర్‌ఎల్ లింక్‌లను ఇతరులకు తెలిసేలా స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర మెసేజింగ్ యాప్‌లు, మెయిల్ ద్వారా ఇతరులకు షేర్ చెయ్యొచ్చు. తర్వాతి కాలంలో వీడియో, వాయిస్ కాల్స్‌ చేయాలనుకునే వారి ప్రథమ ఎంపికగా తన పరిధిని విస్తరించుకుంది వాట్సాప్. 


వాట్సాప్ పేమెంట్స్‌ 

ఏ ఇతర మెసేజింగ్ యాప్‌లో లేని వాట్సాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న అద్భుతమైన ఫీచర్ పేమెంట్స్. గూగుల్ పే, ఫోన్‌ పే, భీమ్‌ తరహాలోనే వాట్సాప్‌ పేమెంట్స్‌ కూడా యూపీఐతో పనిచేస్తుంది.  డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే వాళ్లు ప్రత్యేకంగా పేమెంట్స్ యాప్‌ ఉపయోగించాల్సిన అవసరంలేదు. అలానే మీరు నగదు పంపాలనుకున్న వ్యక్తి వాట్సాప్ పేమెంట్స్‌లో రిజిష్టర్ కాకున్నా వారి యూపీఐ ఐడీ ఎంటర్ చేసి నగదు ట్రాన్స్‌ఫర్ చెయ్యొచ్చు. 


ఫాక్ట్‌ చెక్

వాట్సాప్‌లో రోజుకి ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఉంటాయి. అందుకే మనకి వచ్చిన మెసేజ్‌లను ఇతరులకు ఫార్వార్డ్ చేసేముందు అది నిజమా..కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ ‘ఫాక్ట్ చెక్’ అనే ఫీచర్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఐదుసార్లు అంతకి మించి పార్వార్డ్ చేసిన మెసేజ్‌లపై రెండుసార్లు ట్యాప్ చేస్తే పక్కన సెర్చ్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ సమాచారాన్ని గూగుల్ సెర్చ్‌లో వెతకమంటారా అని అడుగుతుంది. అందులో సెర్చ్‌ వెబ్‌పై క్లిక్ చేస్తే గూగుల్‌లో దానికి సంబంధించిన ఇతర యూఆర్‌ఎల్ లింక్స్‌, సమాచారం చూపిస్తుంది.     


డిస్‌అపియరింగ్ మెసేజెస్ 

గతేడాది వాట్సాప్ కొత్తగా డిస్‌అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా ఛాట్ మెసేజ్‌లు ఏడు రోజుల తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. వ్యక్తిగత, గ్రూప్‌ ఛాట్‌లను కూడా కనిపించకుండా చెయ్యొచ్చు. గ్రూప్‌ ఛాట్‌లలో డిస్‌అపియరింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసే అధికారం కేవలం గ్రూప్‌ అడ్మిన్‌లకు మాత్రమే ఉంటుంది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ కాంటాక్ట్‌పై క్లిక్ చేస్తే డిస్‌అపియరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. 


క్రియేట్ రూమ్

ఆన్‌లైన్ సమావేశాల కోసం వాట్సాప్ క్రియేట్ రూమ్ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఒకేసారి 50 మంది వీడియో కాల్ మాట్లాడుతూ ఛాట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్ అటాచ్‌ సింబల్‌పై క్లిక్ చేస్తే క్రియేట్ రూమ్ అనే ఫీచర్ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే కంటిన్యూ ఇన్ మెసెంజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ మెసేంజర్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ పేరు మీద క్లిక్ చేస్తే రూమ్ క్రియేట్ అవుతుంది. ఆ లింక్‌ను ఇతరులతో షేర్ చేసుకుని వాళ్లతో ఛాట్ చెయ్యొచ్చు. మొబైల్/డెస్క్‌టాప్ వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.     


ఆల్వేస్‌ మ్యూట్‌

గతంలో మనకు అవసరంలేని వాట్సాప్‌ ఖాతా లేదా గ్రూప్ నోటిఫికేషన్లను పరిమిత కాలవ్యవధి వరకు మాత్రమే మ్యూట్ చేసేవాళ్లం. ఇందులో 8 గంటలు, వారం, ఏడాది ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఏడాది ఆప్షన్ స్థానంలో వాట్సాప్ కొత్తగా ఆల్వేస్ మ్యూట్‌ని తీసుకొచ్చింది. దీని వల్ల మనం అన్‌ మ్యూట్ చేసేవరకు సదరు యూజర్ లేదా గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మ్యూట్‌లోనే ఉంటాయి.   


పిఐపి మోడ్

యూజర్స్‌కి వాట్సాప్ అందిస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ పిక్చర్‌-ఇన్‌-పిక్చర్ మోడ్‌ (పిఐపి). వాట్సాప్‌లో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం లేదా యూఆర్‌ఎల్ వీడియో లింక్‌ షేర్ చేస్తే యాప్‌లో వాటిని చూడొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరంలేదు. 


రాబోయే ఫీచర్స్‌..


మల్టీ డివైజ్  సపోర్ట్ 

ఇప్పటి వరకు వాట్సాప్‌ను ఒక డివైజ్‌లో మాత్రమే ఉపయోగించగలం. ఇకమీదట ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. డెవలెప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ ఖాతాను లాగిన్ అవ్వొచ్చు. 


వెబ్‌ కాలింగ్ 

మొబైల్ వెర్షన్‌ను మాత్రమే పరిమితమైన ఆడియో/వీడియో కాలింగ్ ఫీచర్‌ను త్వరలో డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. డెస్క్‌టాప్‌లో కాల్‌ వచ్చినప్పుడు పాప్‌-అప్‌ విండోలో కాల్‌ ఆన్సర్, రిజెక్ట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ డెస్క్‌టాప్‌లో ఉపయోగించాలంటే హెడ్‌సెట్, వెబ్‌కామ్ తప్పనిసరిగా ఉండాలి. 


మ్యూట్ వీడియో

 కొన్ని సార్లు మనకు నచ్చిన వీడియోలను స్టేటస్‌లో అప్‌డేట్ చేస్తుంటాం. వాటిలో మ్యూజిక్ అన్‌మ్యూట్ చేయాలంటే ప్రత్యేకంగా ఎడిట్ చేయాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ మ్యూట్ వీడియో ఆప్షన్‌ను తీసుకొస్తుంది. వాట్సాప్‌లో వీడియో అటాచ్ చేశాక కింద ట్రిమ్మింగ్ బార్‌ కింద సౌండ్ సింబల్ ఉంటుందట. దానిపై క్లిక్ చేస్తే మీరు పంపుతున్న వీడియో మ్యూట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. 


లాగౌట్  

కొద్దిరోజులు వాట్సాప్ ఖాతా ఉపయోగించకూడదనుకున్నారు. యాప్‌ అన్‌-ఇన్‌స్టాల్ చేయడం లేదా ఖాతా డిలీట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ లాగౌట్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ నుంచి కొంత కాలం దూరంగా ఉండాలనుకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాగౌట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న డిలీట్ అకౌంట్ స్థానంలో ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీటా యూజర్స్‌కి లాగౌట్ ఫీచర్ అందుబాటులో ఉంది. 


మెన్షన్ బ్యాడ్జ్‌  

వాట్సాప్ త్వరలో తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్ మెన్షన్ బ్యాడ్జ్. దీని సాయంతో గ్రూప్‌లో స్నేహితులను ట్యాగ్ చెయ్యొచ్చు. ఇది కూడా బీటా యూజర్స్‌కి అందుబాటులో ఉంది.  


ఇవేకాకుండా మరెన్నో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ వాట్సాప్‌లో ఉన్నాయి. ఇంతటీ ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌పై ఇటీవలి కాలంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ. ఈ పాలసీ అమలు చేయడం ద్వారా యూజర్స్ డేటాను వాట్సాప్ ఇతరులతో పంచుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫిబ్రవరి 8 తేదీ నుంచి అమలు చేయాల్సిన కొత్త పాలసీ నిర్ణయాన్ని మే 15 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది. బిజినెస్ ఖాతాలకు సంబంధించిన పరిమిత సమాచారాన్ని యూజర్‌ అనుమతితో మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తామని వెల్లడించింది. ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సాంకేతికత ఉపయోగించడంతో వ్యక్తిగతంగా యూజర్స్ చేసే మెసేజ్‌లు, కాల్స్‌, ఇతర డేటాను వాట్సాప్ చూడలేదని తెలిపింది. అలానే మే 15 తేదీ నుంచి కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో కొంత మంది యూజర్స్‌కి  ఈ పాలసీకి సంబంధించిన అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని