logo

కల్తీమే సవాల్‌

కరోనా, ఇంధన ధరలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి ఉత్పత్తిదారులు, వ్యాపారులు నిత్యావసర సరకులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ఏది కొందామన్నా ఆకాశాన్ని అంటాయి. ధరలు పెరుగుతున్నా కొద్ది

Updated : 23 May 2022 05:06 IST

నీలగిరి, న్యూస్‌టుడే: కరోనా, ఇంధన ధరలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి ఉత్పత్తిదారులు, వ్యాపారులు నిత్యావసర సరకులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ఏది కొందామన్నా ఆకాశాన్ని అంటాయి. ధరలు పెరుగుతున్నా కొద్ది అక్రమార్కులు నిత్యావసర సరకులను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సరకుల ధర పెరిగిన కొద్దీ హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు, స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్మేవారు ఆహార పదార్థాల ధరలు పెంచలేకపోతున్నారు. కారణం వాటి మధ్య పోటీ ఉండటమే. ఈ క్రమంలో అక్రమార్కులు కల్తీ సరకులను తీసుకొచ్చి వీటికి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ధర తగ్గుతుందని వారూ కొనుగోలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద మూతపడిన ఓ హోటల్‌ గదిలో ఆదివారం 400 లీటర్ల కల్తీ వంట నూనె ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు సీజ్‌ చేయడం ఈ అనుమానాలకు బలమిస్తోంది. యాదాద్రి జిల్లాలో పాలు కల్తీ చేసి హైదరాబాద్‌ నగరానికి తరలించి అక్కడ విక్రయిస్తున్న వారు పట్టుబడిన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కల్తీ టీ పొడి విక్రయాలు తక్కువేం కాదు. వాడి పడేసిన టీ పొడిని సేకరించి రంగు కలిపి తాజా పొడిగా తయారు చేసి ద్విచక్రవాహనాలపై తిరుగుతూ దుకాణాలు, హోటళ్లలో  విక్రయిస్తున్నారు.  


తనిఖీలు..

ల్తీ సరకుల విక్రయాలపై ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టారు. తినుబండారాలు తయారీదారులు, హోటళ్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు, బిర్యానీ కేంద్రాలపై దాడులు చేసి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత వస్తువులు వాడినట్లు తేలితే కేసులు నమోదు చేస్తున్నారు. తయారు చేస్తున్న చోట పరిసరాలు పరిశుభ్రంగా లేని నిర్వాహకుల ఫుడ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసి జరిమానా విధిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల వరుస దాడులు చేసి కేసులు నమోదు చేశారు. వంట నూనెలో కల్తీలపై ఫిర్యాదులు రావడంతో ఉమ్మడి జిల్లాలోని మిల్లులపై దాడులు చేశారు. మిల్లులో నూనె తయారు చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి విడిగా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు.


నిఘా పెంచాం
- జ్యోతిర్మయి, ఆహార భద్రత అధికారిణి, ఉమ్మడి నల్గొండ  జిల్లా

అనుమానిత వ్యాపారాలు, తయారీదారులపై నిఘా పెంచాం. వినియోగదారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ప్రత్యేక బృందాలతో అన్ని చోట్ల దాడులు చేసి నమూనాలు సేకరిస్తున్నాం. వంట నూనెలు, టీ పౌడర్‌, పప్పులు, బేకరి ఉత్పత్తుల, బిర్యానీ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని