48 రోజులు కీలకం

రాష్ట్రంలో తొలివిడతలో కరోనా టీకా అందించే 48 రోజులు చాలా కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో సుమారు 75 లక్షల మంది

Updated : 21 Dec 2020 08:43 IST

తొలి విడతలో 75 లక్షల మందికి కరోనా టీకా
రెండు డోసుల పూర్తికి దాదాపు 48 రోజుల సమయం
రాష్ట్రానికి కోటిన్నర డోసులు
దుష్ఫలితాలు ఎదురైతే.. సత్వర చికిత్సకు 10 వేల ప్రత్యేక కిట్లు
అత్యవసరమైతే తరలించేందుకు 60 ఆసుపత్రుల గుర్తింపు
టీకా పంపిణీపై వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలివిడతలో కరోనా టీకా అందించే 48 రోజులు చాలా కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో సుమారు 75 లక్షల మంది జనాభాకు తొలివిడతలో కొవిడ్‌ టీకాను అందించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య, రవాణా తదితర ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడినవారు, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు.  వీరందరికీ 48 రోజుల్లో రెండు డోసుల టీకా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వారి సమాచారం సేకరణే సవాల్‌
వైద్యసిబ్బంది సమాచారంలో దాదాపుగా స్పష్టత వచ్చేయగా.. పారిశుద్ధ్య, పోలీసులు, రవాణా సిబ్బంది సమాచారం కూడా త్వరలో ఆయా శాఖల నుంచి రానుంది. అయితే, 50 ఏళ్ల పైబడినవారి సమాచారాన్ని ఎలా సేకరించాలనేది ఇప్పుడు సవాల్‌గా మారింది. ఓటరు జాబితాలో నమోదు చేసుకునేటప్పుడు కచ్చితంగా పుట్టిన సంవత్సరం పొందుపరుస్తారు కాబట్టి.. ఆ కోణంలో సమాచారాన్ని సేకరించడంపై దృష్టిపెట్టారు. 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సమాచార సేకరణ కూడా కష్టంగానే మారింది. ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయా వయస్సు లోపు ఉన్నవారి సమాచారం కొంత లభ్యమయ్యే అవకాశం ఉంది. అన్ని కేటగిరీల్లో టీకాకు అర్హులైన వారి సమాచారాన్ని కొవిన్‌ యాప్‌లో పొందుపరుస్తారు. ఈ విధానాల్లో తమ సమాచారం రానివారి కోసం.. నేరుగా యాప్‌లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
10 వేల కేంద్రాలు.. 10 వేల బృందాలు
* నిర్దేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్రానికి సుమారు కోటిన్నర డోసులు రానున్నాయి.
* ఒక్కో బృందంలో నర్సు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త చొప్పున.. ముగ్గురుంటారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇలా 10 వేల బృందాలు.. ఏక కాలంలో 10 వేల కేంద్రాల్లో టీకాలందిస్తుంటాయి.
* ఒక్కో బృందం రోజుకు సుమారు 80-100 మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. 75 లక్షల మందికి తొలిడోసు వేయడానికి గరిష్ఠంగా 8-10 రోజుల సమయం పడుతుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
* తొలిడోసు ఇచ్చాక 28 రోజుల వ్యవధి అనంతరం మలిడోసు ఇవ్వాల్సి ఉంటుంది.  మలిడోసునూ 10 రోజుల్లో పూర్తిచేస్తారు. తొలిడోసు నుంచి రెండోడోసును పూర్తిచేయడానికి మొత్తంగా సుమారు 48 రోజుల సమయం పడుతుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
* రాష్ట్రంలో వచ్చే నెల రెండోవారంలో టీకాలు అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జనవరి 15న తొలిడోసు వేయడం ప్రారంభిస్తే.. అదే నెల 24 నాటికి రాష్ట్రంలో నిర్దేశించిన 75 లక్షల మందికి తొలిడోసు పంపిణీ పూర్తవుతుంది.
* తొలిడోసు మొదలైన 4 వారాల తర్వాత అంటే.. ఫిబ్రవరి 12న రెండో డోసు ఇవ్వడం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ తేదీ నుంచి 10 రోజుల తర్వాత అంటే.. అదే నెల 21 నాటికి  రెండో డోసు కూడా పూర్తవుతుందనీ,  అయితే ఇదంతా టీకా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారు? అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అత్యవసర చికిత్సకు ప్రాధాన్యం
రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్యసిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. మొత్తంగా టీకాల పంపిణీలో పాల్గొనే దాదాపు 50 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే 7-10 రోజుల్లో అన్ని స్థాయుల్లోనూ ఈ శిక్షణ పూర్తవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. టీకాలు ఇచ్చే సమయంలో ఒకవేళ ఎవరిలోనైనా దుష్ఫలితాలు కనిపిస్తే.. వెంటనే విరుగుడు చికిత్స అందించేందుకు అన్ని కేంద్రాల్లోనూ ఒక్కో ప్రత్యేక కిట్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకోసం మొత్తంగా 10 వేల కిట్లను సిద్ధం చేస్తున్నారు. మరింత మెరుగైన చికిత్స అవసరమైన సందర్భాల్లో తరలించేందుకు ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ ఒక అంబులెన్సును అందుబాటులో ఉంచనున్నారు. అవసరమైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 60 స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేశారు. టీకాపై అపోహలు తొలగించడానికి ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. టీకాపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారాలు చేస్తుండడంతో.. అపోహలు తొలగించడానికి యునిసెఫ్‌ సహకారంతో ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.


50 ఏళ్లు పైబడినవారు  64 లక్షల మంది..

* ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇప్పటి వరకూ 2.67 లక్షలున్నట్లుగా సమాచారం అందింది. అయితే, వీరు గరిష్ఠంగా 3 లక్షల వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు.
* పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు తదితరులు సుమారు 2 లక్షల మంది వరకూ ఉంటారని ప్రాథమికంగా గుర్తించారు.
* 50 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
* 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు 6 లక్షల మందికిపైగా ఉంటారని భావిస్తున్నారు.


జులై తర్వాత బహిరంగ విపణిలోకి!

కొవిడ్‌ టీకా వచ్చే ఏడాది జులై తర్వాత బహిరంగ విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. వచ్చే జులై, ఆగస్టుల నాటికి సాధారణ ప్రజలందరూ కొనుగోలు చేసే విధంగా తీసుకొస్తారనీ, దాని ధర బహిరంగ విపణిలో సుమారు రూ.250-300 వరకూ ఉండొచ్చని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇవీ చదవండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని