హైదరాబాద్‌ను వీడని వాన

రాజధాని హైదరాబాద్‌ నగరంలో వరుణుడు తెరిపినివ్వలేదు. శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచీ దంచికొట్టగా.. నగరమంతటా తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా

Published : 04 Sep 2021 04:43 IST

శివారులో బీభత్సం.. పలుచోట్ల చిరుజల్లులు

ఈనాడు డిజిటల్‌, ఈనాడు- హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నగరంలో వరుణుడు తెరిపినివ్వలేదు. శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచీ దంచికొట్టగా.. నగరమంతటా తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు తేరుకోలేదు. ఖైరతాబాద్‌, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, కూకట్‌పల్లి, జల్‌పల్లి, హయత్‌నగర్‌, జీడిమెట్ల, కొంపల్లి ఉమామహేశ్వరకాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. గతేడాది వర్షం మిగిల్చిన చేదు మరకల్ని గుర్తు చేస్తూ ఉమామహేశ్వరకాలనీలో దాదాపు ముప్పైకి పైగా ఇళ్లు నీట మునిగాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ విభాగాల సహాయక చర్యలు కొనసాగాయి. నగర శివారులోని రామచంద్రాపురంలో అత్యధికంగా 4.5 సెం.మీ., శేరిలింగంపల్లిలో 3 సెం.మీ. వాన కురవగా, అత్యల్పంగా షేక్‌పేటలో 0.1 సెం.మీ. పడింది. లింగంపల్లిలో 1.38 సెం.మీ., బీహెచ్‌ఈఎల్‌లో 1.35 సెం.మీ., వనస్థలిపురంలో 1.18 సెం.మీ, మణికొండ 0.78 సెం.మీ., గచ్చిబౌలి 0.65సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.


చిక్కుకున్న జలపాతం సందర్శకులు

మామడ, న్యూస్‌టుడే: జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన వారు అకస్మాత్తుగా వచ్చిన వరదలో చిక్కుకొన్న సంఘటన శుక్రవారం నిర్మల్‌ జిల్లా మామడ మండలం వాస్తాపూర్‌ వాగువద్ద చోటుచేసుకుంది. వాగు ఉప్పొంగడంతో నిర్మల్‌కు చెందిన 18 మంది సందర్శకులు బయటకు రాలేకపోయారు. సర్పంచి సంతోష్‌, ఎస్‌ఐ వినయ్‌ల ఆధ్వర్యంలో స్థానికులు సందర్శకులను సాయంత్రం 6.30 గంటలకు క్షేమంగా తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


బతుకుబండిపై పిడుగు పోటు
ముగ్గురి మృతి

కౌటాల, కౌటాల గ్రామీణం-న్యూస్‌టుడే: పొలం పనులు ముగించుకొని ఎద్దులబండిపై ఇంటికి వస్తున్న ముగ్గురు పిడుగుపాటుకు బలయ్యారు. ఘటన కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోర్కుట్‌ పున్నయ్య(45), డొంగ్రె పద్మ(40), శ్వేత (20), మరో ఇద్దరు శుక్రవారం సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఎడ్ల బండిపై ఇంటికి వస్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. బండిపై పిడుగు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక ఎద్దు కూడా చనిపోయింది. పున్నయ్య భార్య, కుమారుడు బతికి బయటపడ్డారు.


ప్రవాహంలో ప్రయాణం.. కొద్దిలో తప్పిన ప్రమాదం

నాంపల్లి, గుర్రంపోడు- న్యూస్‌టుడే: ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయకుండా ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని వాగులు ప్రవహించాయి. ఇదే సమయంలో చండూరు మండలం చామలపల్లికి చెందిన నేర్లకంటి నరేశ్‌, రాములు ద్విచక్రవాహనంపై నాంపల్లి మండలం నర్సింహులగూడెం వచ్చారు. వర్షం తగ్గగానే స్వగ్రామానికి బయలుదేరారు. నర్సింహులగూడెం శివారులోని వాగు రోడ్డుపైన ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంతో వాగును దాటే ప్రయత్నించగా అదుపు తప్పి పడిపోయారు. వాగులో కొట్టుకుపోతున్న వీరిలో ఒకరు కల్వర్టు రెయిలింగును పట్టుకోగా.. మరో వ్యక్తి ఓ చెట్టుకొమ్మను పట్టుకొని ప్రాణాలు నిలుపుకొన్నారు. స్థానికులు తాళ్ల సహాయంతో ఇద్దరినీ రక్షించగా.. ద్విచక్రవాహనం మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని