రుద్రూర్‌ వరి.. రైతన్నకు సిరి!

నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన వరి వంగడం సత్ఫలితాన్నిచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఆర్‌.డి.ఆర్‌.1200 వంగడాన్ని పరిచయం చేశారు. ఇది వానాకాలం

Published : 29 Nov 2021 04:28 IST

 ఆర్‌.డి.ఆర్‌. 1200 రకంతో అధిక దిగుబడి

పరిశోధనల్లో సత్ఫలితాలిస్తున్న నూతన వంగడం

పంట పొలాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ఈనాడు- నిజామాబాద్‌, న్యూస్‌టుడే- వర్ని: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన వరి వంగడం సత్ఫలితాన్నిచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఆర్‌.డి.ఆర్‌.1200 వంగడాన్ని పరిచయం చేశారు. ఇది వానాకాలం సీజన్‌ రకం. ప్రస్తుతం నూర్పిళ్లు పూర్తికావడంతో క్షేత్రస్థాయిలో అన్నదాతలు తమ అనుభవాలు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలతో పోలిస్తే సాగునీరు, విద్యుత్తు వినియోగం, పెట్టుబడి గణనీయంగా తగ్గినట్లు వివరిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది రైతులకు ఈ వంగడాన్ని క్షేత్రస్థాయిలో అందించారు. పంట 130-135 రోజుల్లో కోతకొచ్చింది. పైరుకు దోమ, అగ్గితెగులు సోకలేదని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బాలాజీనాయక్‌ వెల్లడించారు.

హెక్టారుకు 86 క్వింటాళ్ల దిగుబడి

ఈ కొత్త వంగడానికి సంబంధించి 2012లో రుద్రూర్‌ పరిశోధన స్థానంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. 9 దశల్లో ఈ వరి రకాన్ని పరిశీలించారు. పదోదశ కింద రాజేంద్రనగర్‌ వర్సిటీ పర్యవేక్షణలో భిన్న ప్రాంతాల్లో పరిశీలించారు. ఇందులో రుద్రూర్‌ పరిశోధన స్థానంలో ఈ వంగడం(వానాకాలానికి అనువైన) హెక్టారుకు 86.37 క్వింటాళ్ల దిగుబడితో మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం దీన్ని క్షేత్రస్థాయిలో రైతులకు అందించి రెండు, మూడు సీజన్లు పరిశీలిస్తారు. దీన్ని చిరుసంచుల దశ అంటారు. ఈ ప్రక్రియలో తొలి సీజన్‌ పరిశీలన పూర్తవగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇలా మూడు దశలు పూర్తయ్యాకే దీన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతిస్తారు. కాగా రుద్రూర్‌ పరిశోధన స్థానం రూపొందించిన యాసంగి సీజన్‌కు అనువైన ఆర్‌.డి.ఆర్‌.1162 రకాన్ని కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్‌సెంటర్ల ద్వారా చిరుసంచుల దశ పరిశీలన కోసం రైతులకు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని