Published : 19 Jan 2022 03:20 IST

గణతంత్ర వేడుకల్లో తెలుగు కనిపించదు

తెలంగాణ, ఏపీ శకటాలకు దక్కని స్థానం
మొత్తంమీద 12 రాష్ట్రాలకే అవకాశమన్న రక్షణ శాఖ

ఈనాడు, దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న దిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు స్థానం దక్కలేదు. ఈసారి మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చోటు దక్కింది. విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా తొమ్మిది శాఖల శకటాలూ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. అమృతోత్సవాల ఇతివృత్తంతో కూడిన అంశాలను ఇవి ప్రదర్శించనున్నాయి. ఈసారి కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10.30కి మార్చారు. మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేందుకు ఈ మార్పుచేశారు. ఈసారి ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగరనున్నాయి.  

పర్యావరణ హితంగా ఆహ్వానాలు
ఈసారి రిపబ్లిక్‌ డే, బీటింగ్‌ రిట్రీట్‌ కోసం ఔషధ మొక్కలైన అశ్వగంధ, ఉసిరి, కలబంద విత్తనాలను నిక్షిప్తం చేసిన పర్యావరణ అనుకూలమైన ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. మొత్తంగా 5,000-8,000 మందినే అనుమతిస్తారు. 2020లో 1.25 లక్షల మందిని, 2021లో 25,000 మందిని అనుమతించారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న 15 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేలా ఆరు అడుగులకో సీటు ఏర్పాటుచేశారు. మాస్క్‌ తప్పనిసరి చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌లో తేలికపాటి అధిక ఉష్ణోగ్రతలు కనిపించినా ప్రవేశం నిరాకరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు అతిథులుగా మధ్య ఆసియా దేశాల అధినేతలు ఎవరూ హాజరుకావడం లేదు.

డ్రోన్లతో అపూర్వ ప్రదర్శన
రిపబ్లిక్‌డే పెరేడ్‌ చూసే అవకాశం రాని ఆటోరిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, సఫాయి కార్మికులు, కరోనాపై పోరులో ముందుంటున్నవారు పెరేడ్‌, బీటింగ్‌ రిట్రీట్‌ ఉత్సవాలు చూసేందుకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఈ నెల 29న విజయ్‌చౌక్‌లో జరిగే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ సందర్భంగా దిల్లీ ఐఐటీ సహకారంతో బోట్‌లాబ్‌ అనే అంకురం పది నిమిషాలపాటు డ్రోన్‌ షో నిర్వహించనుంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన వెయ్యి డ్రోన్లు ఇందులో పాల్గొంటాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ విజయాన్ని చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని బీటింగ్‌ రిట్రీట్‌ ముగింపు సందర్భంగా నార్త్‌, సౌత్‌బ్లాక్‌ గోడలపై 3-4 నిమిషాల లేజర్‌ షో రూపంలో ప్రదర్శిస్తారు. బీటింగ్‌ రిట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్‌ షో ఉండటం ఇదే మొట్టమొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి.  


శకటాలపై పునరాలోచన లేదు: రక్షణ శాఖ

వాతులో కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల శకటాలను చేర్చరాదన్న నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన లేదని కేంద్రం స్పష్టంచేసింది. తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై ప్రధాని వెంటనే జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని