Published : 20 Jan 2022 05:06 IST

ఆలోచనలే పెట్టుబడి.. లాభసాటిగా సాగుబడి

విభిన్న పంటల సాగు.. ఆపై సొంతంగా విక్రయాలు
మహబూబాబాద్‌ జిల్లా రైతుల స్ఫూర్తి

ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ.. నష్టపోతున్న అన్నదాతలు విభిన్న పంటలపై దృష్టి సారిస్తే లాభాల బాట పట్టొచ్చు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన దిగుబడులకు మంచి డిమాండ్‌ ఉంటోంది. పండించిన పంటలను సరైన రీతిలో మార్కెటింగ్‌ చేసుకోవడమూ అవసరమే. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన ఓ రైతు ప్రకృతి సేద్య విధానంలో 13 ఎకరాల్లో పలు రకాల పసుపు, వరి, కందితోపాటు అంతర పంటలూ పండిస్తున్నారు. వాటిని స్వయంగా విక్రయిస్తున్నారు. డోర్నకల్‌కు చెందిన రైతులు పంటల ఉత్పత్తుల విక్రయాలకు యాప్‌ను, మార్ట్‌నూ ఏర్పాటు చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు ‘సాగు’తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్ఫూర్తి పంచుతున్నారు.


18 రకాల పసుపు.. 5 రకాల వరి
కల్వల రైతు ప్రకృతి సేద్యం

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గంట దామోదర్‌రెడ్డి(69) సేద్యంలో వైవిధ్యం చాటుతున్నారు. తొలుత మూడేళ్లు అరెకరంలో పెసర, వేరుసెనగ సాగు చేసేవారు. 13 ఏళ్లుగా ఆరెకరాల సొంత భూమి, ఏడెకరాల కౌలు భూమిలో 18 రకాల పసుపు, 5 రకాల వరి, 3 రకాల కంది పండిస్తున్నారు. వేరుసెనగ, నువ్వులు, పప్పుదినుసులూ సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా మినుము, పెసర, మిరప వేస్తున్నారు. 25 గుంటల్లో ఎరుపు(దేశీయ), నలుపు, మచ్చల కంది, గుంట స్థలంలో చేమదుంప వేశారు. పాలేకర్‌ విధానంలో జీవామృతం, కషాయాలను తయారు చేసుకుని పంటలకు వాడుతున్నారు. పంట ఉత్పత్తులను సొంతంగానే విక్రయిస్తున్నారు.

పసుపు పొడి విక్రయించి..

ఒకటిన్నర ఎకరాల్లో 18 రకాల పసుపు సాగు చేస్తున్నారు. కస్తూరి, 848, ప్రతిభ, రాజపురి, పీతాంబరి, ఎరుపు దుగ్గిరాల, సుగంధ, మామిడి అల్లం తదితరాలు ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి విత్తనాలు తెప్పించారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే.. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొడి చేసి విక్రయిస్తే.. పెట్టుబడి పోను రూ.14 లక్షలు మిగులుతోందని దామోదర్‌రెడ్డి తెలిపారు.

దేశీయ వరి

దామోదర్‌రెడ్డి 3.5 ఎకరాల్లో ఎరుపు, నల్లపు, చెఖోవాతో పాటు చిట్టిముత్యాలు, బాస్మతి వరి సాగు చేస్తున్నారు. ఎరుపు వరి, బాస్మతి రకాలను ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. బియ్యాన్ని కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు.

ఆర్డర్లపై అమ్మకాలు..

పసుపును కేసముద్రంలోని మిల్లుల్లో పొడి పట్టిస్తున్నారు. పెసర, మినుము, కందులను స్వయంగా విసురురాయితో ఇంటి వద్దే పప్పుగా మార్చి.. కిలో ప్యాకెట్లను తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో 5వేల మందికి, దుబాయ్‌, అమెరికా ప్రాంతాల్లోని 30 మందికి పంపుతున్నారు. ఫోన్‌, వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఆర్డర్లు స్వీకరించి.. కొరియర్‌, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపుతుంటారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడల్లో ఏటా నిర్వహించే అగ్రి ఎక్స్‌పోలో స్టాళ్లు పెట్టి వాటిలోనూ విక్రయిస్తుంటారు.


‘యాప్‌’తో లాభాల పంట!
ఖమ్మంలో రైతుల ‘కిసాన్‌ మార్ట్‌’

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: పంటలు పండించడంలోనే కాదు.. విక్రయంలోనూ విజయపథంలో సాగుతున్నారు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అమ్మపాలేనికి చెందిన రైతులు. 2020 నవంబరులో మిరప ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని 303 మంది సభ్యులుగా ఉన్నారు. అప్పుడే యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. దాని ద్వారా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు, బియ్యం, డ్రైఫ్రూట్స్‌ల విక్రయాలు ప్రారంభించారు. అవసరమైన సరకుల్ని ఆర్డర్‌ చేస్తే.. వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు.

రైతుల వద్దే కొనుగోలు

2021 జనవరిలో ఖమ్మంలో కిసాన్‌ మార్ట్‌ను ప్రారంభించారు. ఇందులో విక్రయించే 80 శాతం సరకులను రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. కందులు, పెసర్లు, బొబ్బర్లు, మినుములను మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కొనుగోలు చేసి.. ఖమ్మంలోని మిల్లుల్లో మర ఆడిస్తున్నారు. రైతుల వద్ద సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యం పట్టించి అమ్ముతున్నారు. నెలకు టన్ను బియ్యం విక్రయిస్తున్నారు. కారం, పసుపు, మునగాకు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గోరింటాకు పొడులను మహిళలతో తయారు చేయించి అమ్ముతున్నారు.


రూ.60 లక్షల మూలనిధి
-రామారావు, కిసాన్‌మార్ట్‌ మిరప ఉత్పత్తిదారుల సంస్థ ఛైర్మన్‌

ప్రస్తుతం సంస్థ మూలనిధి సుమారు రూ.60 లక్షలు ఉంది. ప్రతి నెలా నిర్వహణ, సరకుల కొనుగోలు ఖర్చులు పోనూ రూ.50 వేల లాభం వస్తోంది. వేసవిలో 3టన్నుల మామిడిని, మునగాకు పొడిని అమెరికాకు పంపించాం. ప్రభుత్వం సహకారం అందిస్తే విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. యాప్‌ను 10వేల మంది వినియోగిస్తున్నారు. ప్లేస్టోర్‌లో ‘కిసాన్‌మార్ట్‌ ఖమ్మం’ అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని