
దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ
ప్రపంచస్థాయి ఔషధ, వైద్యసేవల కేంద్రంగా హైదరాబాద్
గణతంత్ర వేడుకల్లో గవర్నర్
ఈనాడు, హైదరాబాద్: అనతి కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో అత్యంత వేగంగా దూసుకెళ్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. అన్నదాతల కృషితో దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. కొవిడ్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, శాసనసభ, మండలి ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రి, బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ ‘‘నాణ్యమైన ఉన్నతవిద్యలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతోంది. రాజ్‌భవన్ తరఫున గిరిజనుల కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టాం. ఆదివాసీల పోషకాహార స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ఆరోగ్యం, ఉపాధి అవకాశాల వృద్ధికి కృషిచేస్తున్నాం’’ అని గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లతో ముచ్చటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హాజరు కాలేనని సమాచారమిచ్చిన సీఎం
కరోనా దృష్ట్యా రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు తాను, మంత్రులు రాలేమని సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి ముందే సమాచారం ఇచ్చినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇటీవలి మంత్రిమండలి సమావేశంలో గణతంత్ర వేడుకలపై చర్చ సందర్భంగా అతి పరిమిత సంఖ్యలో ఉత్సవాలు జరపాలనే నిర్ణయం తీసుకున్నామంటూ సీఎం గవర్నర్‌కు తెలియజేశారని ఆ వర్గాలు వెల్లడించాయి.
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ చిత్ర పటాలకు ఆయన పుష్పాంజలి ఘటించారు. వారు దేశానికి చేసిన సేవలను గర్తుచేసుకున్నారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర జవానుల స్మారక స్తూపం వద్ద జ్యోతి వెలిగించి నివాళి అర్పించారు.