Updated : 03 Dec 2021 05:53 IST

Omicron: దేశంలోకి ‘ఒమిక్రాన్‌’

బెంగళూరులో 2 కేసులు

బాధితుల్లో ఒకరు దక్షిణాఫ్రికా వాసి

బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళకు పాజిటివ్‌.. సీసీఎంబీకి నమూనాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు / దిల్లీ

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. తొలిసారిగా.. కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియమ్‌ ‘ఇన్సాకోగ్‌’ ఈ కేసులను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటకలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ కేసులకు సంబంధించి.. ఒకరు దక్షిణాఫ్రికా వాసి (66) కాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి (46)గా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె చీఫ్‌ కమిషనర్‌ గౌరవ్‌ గుప్తా తెలిపారు. నవంబరు 20న  నగరానికి వచ్చిన దక్షిణాఫ్రికా వాసికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ తేలడంతో నేరుగా ఓ హోటల్‌లో క్వారంటైన్‌ చేసినట్లు గుప్తా వివరించారు. మూడు రోజుల తర్వాత పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో ఆయనను డిశ్ఛార్జ్‌ చేశారు. అనంతరం నగరంలోని ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా మళ్లీ నెగటివ్‌ రావడంతో నవంబరు 27న దుబాయ్‌ వెళ్లిపోయినట్లు గుప్తా తెలిపారు. దక్షిణాఫ్రికా వాసి శాంపిల్‌ను జన్యుక్రమ పరిశీలనకు పంపించగా కొత్త వేరియంట్‌గా గురువారం రిపోర్టు వచ్చినట్లు చెప్పారు. అలాగే ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిన బెంగళూరు వాసి స్థానికంగా ఓ ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. నవంబరు 22న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ రావడంతో శాంపిల్‌ను జన్యుక్రమ పరిశీలనకు పంపారు. ఆయనకు సోకింది ఒమిక్రాన్‌గా తేలడంతో ఆయనను ముందు ఇంటివద్ద ఐసొలేషన్‌లో ఉంచి అనంతరం ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నట్లు గుప్తా తెలిపారు. వీరిద్దరితో దగ్గరగా మెలిగిన దాదాపు 500 మందికి (ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌) జరిపిన పరీక్షల్లో ఇంతవరకు ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు కూడా బెంగళూరు వాసికి దగ్గరగా ఉన్న వారేనని (ప్రైమరీ-3, సెకండరీ-2 కాంటాక్ట్స్‌) గుప్తా వెల్లడించారు. విదేశీయాన చరిత్ర లేనప్పటికీ బెంగళూరు వాసికి ఒమిక్రాన్‌ సోకిందని.. అందువల్ల కొత్త వేరియంట్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒమిక్రాన్‌ సోకిన ఇద్దరూ రెండు డోసుల కొవిడ్‌ టీకా కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ స్పష్టం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోవడంలో ఎవరూ జాప్యం చేయవద్దన్నారు. ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి 7,976 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిలో 10 మంది పాజిటివ్‌గా తేలడంతో జన్యుక్రమ పరిశీలనకు పంపించినట్లు తెలిపారు. బ్రిటన్‌ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌లను ముప్పు ఉన్న దేశాలుగా గుర్తించారు.

లాక్‌డౌన్‌ అవసరం లేదు..

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందా? అన్న విషయమై నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవసరమేమీ లేదని చెప్పారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి అదుపులోనే ఉందని, భయాందోళనలు అవసరం లేదన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో 84.3% మంది కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారని, 49% రెండో డోసు కూడా పొందినట్లు అగర్వాల్‌ వివరించారు. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుందన్నదీ లేనిదీ ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.


హైదరాబాద్‌లో అప్రమత్తం..

ఈనాడు, హైదరాబాద్‌: బ్రిటిష్‌ ఎయిర్‌వేయిస్‌ ద్వారా 206 మంది ప్రయాణికులు బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగా వీరికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ(35)కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముప్పు ఉన్న దేశాల్లో బ్రిటన్‌ ఒకటి కావడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆ మహిళను అత్యవసరంగా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ నుంచి నమూనాలను జన్యుక్రమ పరిశీలనకు గాను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. ఈ ఫలితం వచ్చిన తర్వాత ఆమెకు సోకింది డెల్టానా? ఒమిక్రాన్‌ వేరియంటా? అనేది తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి. శుక్ర, శనివారాల్లో ఈ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆమెతో పాటు ప్రయాణించిన మిగిలిన ప్రయాణికులకు, అదేరోజు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన 119 మందికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. అందరిలోనూ నెగిటివ్‌గా ఫలితం వెల్లడైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి.


 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని