Updated : 02/05/2021 07:38 IST

5 State Election Result: దండలెవరికి?దండనెవరికి?

నేడే 5 అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు
కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న శాసనసభల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో తృణమూల్‌-భాజపా మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోరు సాగిందని, మమతకు కాస్త మొగ్గు ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. తమిళనాడులో డీఎంకే, కేరళలో వామపక్ష కూటమి, అస్సాంలో ఎన్డీయే అధికారం దక్కించుకోవచ్చని అవి పేర్కొన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగురెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తెరవబోతున్నారు. కరోనా తీసుకువచ్చిన సమస్యలను, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను గమనంలో తీసుకుని ఓట్ల లెక్కింపు బల్లల అమరిక నుంచి అన్నింటా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. లెక్కింపును 1100 మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌సైట్‌, యాప్‌లలో తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎవరి అంచనాలు వారివి
కేరళలో ఈసారీ వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్‌)దే గెలుపు అని, మునుపెన్నడూలేని రీతిలో ఇది జరగబోతోందని సర్వేలు తేచ్చినా విపక్ష యూడీఎఫ్‌ కూటమి మాత్రం ఆశలు విడిచిపెట్టలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే- డీఎంకే మధ్యనే గట్టి పోరు సాగినట్లు తెలుస్తోంది. ఈసారి అధికారం డీఎంకే వశమయ్యే అవకాశాలు ఎక్కువని అంచనాలు తేల్చాయి. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితమూ ఆదివారం వెలువడనుంది. అస్సాంలో కమలదళ కూటమి ముందంజలో ఉంటుందని ఓటర్ల నాడిని ఉటంకిస్తూ వివిధ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. పుదుచ్చేరిలో ఎన్‌.రంగస్వామి నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందనేది ఎగ్జిట్‌ పోల్స్‌ మాట. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తీరు గురించి ఓటర్ల మదిలో ఏముందనేది ఆదివారం నాటి ఫలితాల ద్వారా కొంతవరకు తెలుస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల్లో 78.22% వరకు కేవలం 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కేరళ, తమిళనాడు, బెంగాల్‌ ఉన్నాయి.
 

బెంగాల్‌పైనే ఆసక్తి

ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మిగతావాటి కంటే బెంగాల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా, మోదీ-అమిత్‌షాల నేతృత్వంలో విస్తృతంగా సాగిన ప్రచారం ఫలిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. మమత తన రాజకీయ జీవితంలో ఇంతటి సవాల్‌ను ఎన్నడూ ఎదుర్కోని విషయం తెలిసిందే.


 కరోనా నెగెటివ్‌ అయితేనే కేంద్రాల్లోకి

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించాలంటే అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్లు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ అని ఫలితం వచ్చినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే కరోనా టీకా రెండు మోతాదులూ తీసుకున్నట్లు రుజువు సమర్పించాలి. దీని కోసం శనివారమూ పలువురు టీకాలు తీసుకున్నారు. విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్‌లో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 294 స్థానాలకు గానూ 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్నిచోట్లా శానిటైజ్‌ చేసిన తర్వాతే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను తెరవనున్నారు. లెక్కింపు జరుగుతుండగా కనీసం 15సార్లు ప్రతీ కేంద్రాన్నీ శానిటైజ్‌ చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాస్కులు, ముఖ కవచాలు, శానిటైజర్లను విస్తృతంగా అందుబాటులో ఉంచుతారు. లెక్కింపు బల్లల మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక గదిలో గతంలో 14 బల్లలు ఉండేవి. ఈసారి ఏడుకు మించకుండా చూస్తున్నారు. 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని