మురికి వదిలించని ‘పొరుగు సేవలు’!

తెలంగాణ ఆర్టీసీ బస్సుల శుభ్రత తీరు అధ్వానంగా ఉందని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. బస్సుల నిర్వహణ వ్యవహారాలను పొరుగు సేవల(అవుట్‌ సోర్సింగ్‌)....

Updated : 27 Nov 2021 05:15 IST

ఆర్టీసీ బస్సుల నిర్వహణపై అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సుల శుభ్రత తీరు అధ్వానంగా ఉందని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. బస్సుల నిర్వహణ వ్యవహారాలను పొరుగు సేవల(అవుట్‌ సోర్సింగ్‌) విధానంలో ప్రైవేటీకరించిన నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకు ఆరుగురు అధికారుల బృందాన్ని నియమించింది. బస్సుల కడగటం నుంచి తుడవటం, లోపల శుభ్రం చేయటం తదతర అంశాలను అధికారుల బృందం పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేసింది. తక్షణం ప్రక్షాళన అవసరమని చెప్పింది.

నివేదికలోని ముఖ్యాంశాలు.. 

* అత్యాధునిక బస్సులు, సాధారణ బస్సులను ఒకే తీరుగా శుభ్రం చేయడంతో కొన్ని భాగాలు దెబ్బతింటున్నట్లు గుర్తించారు. జెట్‌ పంపుల నుంచి అత్యంత వేగంగా నీరు రావటంతో ఆధునిక బస్సులు దెబ్బతింటున్నాయి. 

* కొన్ని డిపోల్లో బస్సులను కడిగేందుకు చాలినంత నీరు కూడా అందుబాటులో లేదు.   

* ఏటా భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ బస్సుల నిర్వహణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని ఆ బృందం నివేదికలో తేల్చిచెప్పింది. 

* గుత్తేదారు ఒప్పందంలో పేర్కొన్న సంఖ్యలో శుభ్రంచేసే సిబ్బంది కనిపించటం లేదు. పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు లేరు. 

* పొరుగుసేవల సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటంతో పలువురు పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు.


గుత్తేదారులపై అపరాధ కొరడా 

* ప్రస్తుత విధానం ప్రక్షాళనలో భాగంగా గుత్తేదారుల్లో జవాబుదారీతనం తీసుకురావాలని అధికారుల బృందం సూచించింది. ఒప్పందం ప్రకారం బస్సులను శుభ్రం చేయకపోయినా, సకాలంలో బిల్లుల వివరాలు సమర్పించకున్నా.. తొలిసారి రూ.వెయ్యి అపరాధ రుసుము విధించాలి. అవే పొరపాట్లు రెండోదఫా చేస్తే రూ.రెండు వేలు, రెండుకు మించి తప్పిదాలు చేసిన పక్షంలో రూ.అయిదు వేల చొప్పున రుసుము విధించాలి. 

* ఒకే సంవత్సరంలో మూడు కన్నా ఎక్కువ తప్పిదాలను గుర్తిస్తే ఒప్పందాన్ని రద్దు చేసేందుకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలి. ఆ గుత్తేదారులను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. 

* బస్సులను శుభ్రం చేసే ప్రాంగణానికి తీసుకువచ్చేందుకు ప్రతి డిపోలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఆర్టీసీ పక్షాన విధిగా సూపర్‌వైజర్‌ ఉండాలి. వివరాల్ని రోజూ నివేదికలో నమోదు చేయాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని