ధర తగ్గించి దగా చేస్తారా!

వ్యాపారులు దగా చేస్తున్నారని మిర్చి రైతులు వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర చెల్లించడం లేదని మండిపడ్డారు.

Published : 25 Jan 2022 04:31 IST

ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వ్యాపారులు దగా చేస్తున్నారని మిర్చి రైతులు వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర చెల్లించడం లేదని మండిపడ్డారు. సోమవారం మార్కెట్‌కు మొత్తం 15 వేల బస్తాలు రాగా.. తేజ మిర్చి రకానికి రూ.17,200 గరిష్ఠ ధర పలికింది. ఆ ధరను రెండు మూడు బస్తాలకే చెల్లించి.. మిగిలిన వాటికి రూ.వేలల్లో కోతపెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ఉదయం 7 గంటల నుంచే ఆందోళన ప్రారంభించారు. మార్కెట్‌లోని అడ్తీ వ్యాపారులు, ఖరీదుదారులు కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారని ఆగ్రహంతో 7 కాంటాలను ఎత్తి పడేశారు. రెండు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఏదైనా సమస్య ఉంటే జెండా పాట.. కనీస ధరకు మధ్య వ్యత్యాసం రూ.500 నుంచి రూ.1000 కంటే మించదని, ఏకంగా రూ.6 నుంచి రూ.8 వేల వరకు తగ్గించి దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని మార్కెట్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రైతుల ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. దిగొచ్చిన అధికారులు.. ధర తగ్గించిన మిర్చి బస్తాల కొనుగోళ్లను నిలిపివేశారు. మంగళవారం వీటి ధర నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.


ఖమ్మంలో ‘ఎర్ర బంగారం’ జోరు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిరప పోటెత్తింది. సుమారు 30 వేల బస్తాలు రావటంతో యార్డు మొత్తం కిటకిటలాడింది. ఈ సీజన్‌లో ఇంత భారీగా సరకు రావటం ఇదే మొదటిసారి. ఈ విపణికి ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, నల్గొండ, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతులు పంటను తెచ్చి విక్రయిస్తుంటారు.  సోమవారం క్వింటా మిరప గరిష్ఠ ధర రూ.16,150 పలికింది. కనిష్ఠంగా రూ.12,200, నమూనా ధర రూ.15,000 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.క్వింటాకు రూ.16వేలకి పైగా ధర ఉందని చెబుతూనే.. వ్యాపారులు ఓ పథకం ప్రకారం తక్కువకే కొంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి భారీగా వచ్చింది.  క్వింటా కనిష్ఠ ధర రూ.899, గరిష్ఠ ధర రూ.16,201 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని