లాక్‌డౌన్‌ ఎత్తివేత

తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో

Updated : 20 Jun 2021 10:03 IST

 నేటి నుంచి పూర్తిస్థాయిలో సేవలు  

1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం

ఈ-పాస్‌ విధానం రద్దు

రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో పునఃప్రారంభించాలని, తరగతులను ప్రత్యక్షంగా నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా కేసులు తగ్గుతున్న విషయాన్ని మంత్రిమండలి పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులందించిన నివేదికలను పరిశీలించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని నిర్ధారణకొచ్చింది. లాక్‌డౌన్‌ ప్రభావాన్ని చర్చించింది. జనజీవనం యథాతథంగా సాగాలని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌ను తొలగించాలని తీర్మానించింది. అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది. రోజంతా రాకపోకలకు ఆమోదం తెలిపింది.  వాహనాలకు ఈ-పాస్‌ విధానాన్ని రద్దు చేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు, ఆన్‌లైన్‌ తరగతులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖకు సూచించింది. విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు జులై మొదటి తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని తెలిపింది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 

నిర్లక్ష్యం తగదు 

కరోనా తీవ్రత దృష్ట్యా మే నెల 12 నుంచి లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం దశలవారీగా సమయాల సడలింపులతో శనివారం వరకు 39 రోజులపాటు దాన్ని అమలు చేసింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వాడకాన్ని విధిగా కొనసాగించాలని సూచించింది. స్వీయ నియంత్రణ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. 

పాస్‌ లేకుండానే రాకపోకలు

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తేయడంతో వాహన రాకపోకలకు సంబంధించిన ఈ-పాస్‌ల వ్యవస్థను రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈ-పాస్‌లు లేకుండానే వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు మాత్రం ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా రవాణా అనుమతులు పొంది ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

అన్‌లాక్‌పై నేడు మరో ఉత్తర్వు

లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం శనివారం ఒక జీవో ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, వ్యాపార సంస్థలు, దుకాణాలు రోజంతా నడుస్తాయని అందులో పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కానీ ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో లేవు. అంతర్రాష్ట బస్సు సర్వీసులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సినిమా థియేటర్లు, కబ్బులు, క్రీడామైదానాలు, పబ్‌లతో పాటు వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించి లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్‌కు ముందు సైతం కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటన్నిటిపైనా స్పష్టత కోసం ప్రభుత్వం ఆదివారం మరో ఉత్తర్వును జారీ చేయనున్నట్లు తెలిసింది.

అంతర్రాష్ట్ర బస్సులు అప్పుడే కాదు

అంతర్రాష్ట్ర బస్సుల కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా, ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతుండడమే దీనికి కారణం. అక్కడ ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి సర్వీసులు నడపలేమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ 

ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్‌డౌన్‌ ఎత్తివేశాం. మళ్లీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అదుపు తప్పితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించడంతో వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు అనేక రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావం చూపింది. వ్యాధి వ్యాప్తిపై రోజూ అంచనా వేస్తాం. కేసులు తీవ్రమైతే మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు వెనుకాడబోం. ప్రజలు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి.

-మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని