Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు వేళాయె..

తెలంగాణ పూలపండగ బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు

Updated : 13 Oct 2021 05:36 IST

 కొన్నిచోట్ల నేడు, మరికొన్ని చోట్ల రేపు నిర్వహణ

 సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈరోజే

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పూలపండగ బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలను ప్రకటించడంతో పండగ బుధవారమా లేక గురువారమా అనే సందిగ్ధం ఏర్పడింది. దీనిపై తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు మంగళవారం మాట్లాడుతూ ‘‘బతుకమ్మ పండగను కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు ఆడతారు. కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 13 రోజులు ఆడతారు. స్థానిక పురోహితులు, పండితులు బతుకమ్మ తేదీని నిర్ణయించడం సరైందే. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించి సెలవు ప్రకటించినందున దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా విద్వత్సభ నిర్ణయించింది. ప్రభుత్వపరంగా బుధవారమే ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయంగా విభిన్న ఆచారం గల వారు స్థానిక సంప్రదాయం మేరకు పండగ చేసుకోవచ్చు’’అని తెలిపారు. మరోవైపు ఈ పండగను 9 రోజులు జరిపే ఆనవాయితీ దృష్ట్యా గురువారమే సద్దుల బతుకమ్మ చేసుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ పరిషత్‌ల నేతలు గంగు ఉపేంద్ర శర్మ, కృష్ణమాచార్య సిద్ధాంతి, మరికొందరు పండితులు సూచించారు. 15న దసరా పండగ జరగాలని తెలిపారు. హైదరాబాద్‌లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


వేములవాడలో ఘనంగా వేడుకలు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. శ్రీరాజరాజేశ్వరిదేవి అవతారాలైన సప్తమాతృకలకు చిహ్నంగా ఇక్కడ ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తారు. బతుకమ్మ తెప్ప, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. 


తెలంగాణ భవన్‌లో ...

దిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సాహ్నీ, తెలంగాణ, ఏపీ రెసిడెంట్‌ కమిషనర్లు గౌరవ్‌ ఉప్పల్‌, భావనా సక్సేనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

-ఈనాడు, దిల్లీ


జగిత్యాలలో మహా బతుకమ్మ

ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జగిత్యాల జిల్లా పరిషత్తు భవనం ఆవరణలో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున పేర్చిన బతుకమ్మను ట్రాక్టర్‌లో వేడుకల ప్రాంగణానికి తీసుకువచ్చారు. 

-న్యూస్‌టుడే, జగిత్యాల


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని