Rajnath Singh: త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు

భారత తొలి త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డ హెలికాప్టర్‌ ప్రమాదంపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.

Updated : 10 Dec 2021 05:23 IST

హెలికాప్టర్‌ ప్రమాదంపై పార్లమెంటులో రాజ్‌నాథ్‌ ప్రకటన

జనరల్‌ రావత్‌ మృతిపై ఉభయ సభల సంతాపం

ఘటనాస్థలంలో లభ్యమైన బ్లాక్‌బాక్స్‌

విషమంగా గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ పరిస్థితి

మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలింపు

దిల్లీలోని విమానాశ్రయంలో గురువారం త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పార్ధివదేహం
వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఈనాడు-చెన్నై; న్యూస్‌టుడే- బెంగళూరు, కోయంబత్తూరు; దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డ హెలికాప్టర్‌ ప్రమాదంపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన ప్రకటన చేశారు. మరోవైపు- హెలికాప్టర్‌ కూలిపోయిన స్థలంలో అధికారులు బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడంలో అది కీలకంగా మారనుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది.

జనరల్‌ రావత్‌ సహా ఇతర మృతులకు లోక్‌సభ, రాజ్యసభ గురువారం నివాళులర్పించాయి. వారి మృతికి సంతాప సూచకంగా ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రమాదంపై ఉభయ సభల్లోనూ రాజ్‌నాథ్‌ ప్రకటన చేశారు. ‘‘వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 హెలికాప్టర్‌ సూలూర్‌ వైమానిక స్థావరం నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 12:15 గంటలకు అది వెల్లింగ్టన్‌కు చేరుకోవాల్సింది. కానీ దాదాపు 12:08 గంటలకు సులూర్‌ వైమానిక స్థావరంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయి. తర్వాత కున్నూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలిపోయిన హెలికాప్టర్‌ శకలాలు వారికి కనిపించాయి. సహాయక బృందాలు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని.. బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. వారిని హుటాహుటిన వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందగానే మేం వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరిని బుధవారమే ఘటనాస్థలానికి పంపించాం’’ అని రక్షణ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్లు చెప్పారు. ఆ బృందం బుధవారమే వెల్లింగ్టన్‌కు చేరుకొని పని ప్రారంభించిందని తెలిపారు. జనరల్‌ రావత్‌ సహా ఇతర మృతుల అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు.

వరుణ్‌ సింగ్‌ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

యోధుడిని కోల్పోయాం: ఓం బిర్లా

జనరల్‌ రావత్‌ మృతిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నైపుణ్యవంతుడైన ఓ యోధుడిని, అసమాన వ్యూహచతురుడిని దేశం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా దేశ సేవలో గడిపిన రావత్‌.. భద్రతారంగంలో గణనీయమైన సంస్కరణలు తెచ్చారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అన్ని పార్టీల సభాపక్ష నాయకులు విడివిడిగా సంతాపం తెలిపేందుకు అనుమతించాలని విపక్ష నేత మల్లికార్జునఖర్గే కోరగా.. అలాంటి సంప్రదాయం లేదని, సభ మొత్తం నివాళులర్పిస్తుందని హరివంశ్‌ తెలిపారు.

వరుణ్‌ సింగ్‌కు 80% కాలిన గాయాలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ను గురువారం ఉదయం వెల్లింగ్టన్‌ ఆసుపత్రి నుంచి రోడ్డుమార్గంలో తొలుత సూలూర్‌కు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయనకు 80% కాలిన గాయాలయ్యాయి. వరుణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. మరో 48 గంటలపాటు వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందించనున్నట్లు వైద్యులు చెప్పారని వరుణ్‌ తండ్రి విశ్రాంత కర్నల్‌ కె.పి.సింగ్‌ తెలిపారు. అంతకుముందు- వెల్లింగ్టన్‌ ఆసుపత్రిని తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సందర్శించారు. వరుణ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. గ్రూప్‌ కెప్టెన్‌ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రపతికి వివరాలు చెప్పిన రాజ్‌నాథ్‌

హెలికాప్టర్‌ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరాలు చెప్పారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన రాష్ట్రపతితో రాజ్‌నాథ్‌ గురువారం భేటీ అయ్యారు. ప్రమాద ఘటన, అనంతరం తలెత్తిన పరిస్థితుల గురించి ప్రథమ పౌరుడికి మంత్రి సమగ్రంగా వివరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని