Teachers: ఉపాధ్యాయులకు మరో షాక్‌

స్థానికతను పక్కనపెట్టడంతోపాటు సీనియారిటీ జాబితాలో తప్పులున్నా కొత్త జిల్లాలు కేటాయించారని ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం సోమవారం మరో షాక్‌ ఇచ్చింది. ఆప్షన్‌ ఫారాలు సమర్పిస్తే

Updated : 28 Dec 2021 09:03 IST

పోస్టింగ్‌ల కోసం ఆప్షన్‌ ఫారాలు సమర్పించాలని మౌఖిక ఆదేశాలు

ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ అమలు చేయాలన్న సంఘాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్థానికతను పక్కనపెట్టడంతోపాటు సీనియారిటీ జాబితాలో తప్పులున్నా కొత్త జిల్లాలు కేటాయించారని ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం సోమవారం మరో షాక్‌ ఇచ్చింది. ఆప్షన్‌ ఫారాలు సమర్పిస్తే తదనుగుణంగా పోస్టింగ్‌లు ఇచ్చేలా మౌఖిక ఆదేశాలు జారీచేసింది. సోమవారం రాత్రికల్లా ఖాళీలను వరుస క్రమంలో ఎంచుకోవాలని, ఆప్షన్‌ ఫారాలను కమిటీకి సమర్పించాలని జిల్లా అధికారులు ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు కంగుతిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వరకు ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. వారికి ఆయా పాఠశాలల్లో పోస్టింగ్‌ ఇవ్వాలంటే కౌన్సెలింగ్‌ జరపాలి. అందుకు భిన్నంగా ‘ఆప్షన్‌ ఫారాల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చేలా’ ఆదేశాలివ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ (మ్యాన్యువల్‌)లో తన ముందు తెరపై కనిపించే ఖాళీల్లో ఏదోఒకటి ఎంచుకునే అవకాశం ఉద్యోగికి ఉంటుంది. తర్వాత వచ్చేవారు మిగిలిన ఖాళీల్లో మరొకటి ఎంచుకుంటారు. గతంలో ఇలాగే జరిగేది. ఇప్పుడు చెప్పిన విధానం గందరగోళానికి తెరలేపుతుంది. ఉదాహరణకు ఒక జిల్లాలో ఎస్‌జీటీ ఖాళీలు 200 ఉంటే, వాటన్నింటినీ ఫారంలో రాయాలి. ఎంపిక కమిటీ అందులో ఏదో ఒకటి కేటాయిస్తుంది. దీనివల్ల కోరుకున్న స్థానం వచ్చే అవకాశం ఉండదు’’ అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ‘ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు ఆయా కలెక్టర్లకు విన్నవించినప్పుడు ప్రత్యక్ష కౌన్సెలింగ్‌కు అంగీకరించారని, ఇప్పుడు హఠాత్తుగా కొత్తనిర్ణయం తీసుకున్నారని’ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) తెలిపింది. ఈ విధానాన్ని ఖండిస్తున్నామని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అద్యక్షుడు అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌ పేర్కొన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన 22 వేల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 4-5 వేల మంది నుంచి అభ్యంతరాలు(అప్పీళ్లు) వచ్చినట్లు తెలిసింది. వాటిల్లో ఎక్కువగా భార్యాభర్తలైన ఉద్యోగుల నుంచి వచ్చాయని సమాచారం. వాటిని త్వరగా పరిష్కరించడంపై విద్యాశాఖ దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని