TS News:ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చూడలేదు

తెలంగాణలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం ప్రారంభమైందని, ఇందులో భాజపా విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడిగే

Updated : 08 Jan 2022 05:25 IST

కేసీఆర్‌ భయస్తుడు... అందుకే సంజయ్‌ను అరెస్టు చేయించారు

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌

భావోద్వేగానికి గురైన బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గన్‌ఫౌండ్రి; న్యూస్‌టుడే, బేగంపేట: తెలంగాణలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం ప్రారంభమైందని, ఇందులో భాజపా విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, నిరసనలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా.. నేతలను జైలుకు పంపడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ భయస్తుడని, ఇలాంటి సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సభలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనను తీవ్రంగా విమర్శించారు. 

గద్దె దించే వరకు విశ్రమించం..

‘శ్రీకృష్ణుడి జననంతో తనకు ప్రమాదమన్న భయంతో కంసుడు తన సోదరికి పుట్టిన పిల్లలందరినీ చంపించాడు. ఆ జైల్లోనే పుట్టిన కృష్ణుడు కంసుడిని వధించాడు... కేసీఆర్‌కు కలలో కూడా సంజయ్‌ గుర్తుకు వస్తుండడంతో భయంతో అరెస్టు చేయించారు.పిరికివాళ్లు, బయపడేవారే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు పంపుతారు ఈ ముఖ్యమంత్రి ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం. కేసీఆర్‌.. నేను మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ని. తెలంగాణ గడ్డపైకి వచ్చా. భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జీ చేస్తే ఊరుకుంటామా? భాజపా అంటే బిర్యానీ అనుకున్నరా? మీ అరాచకపాలనకు వ్యతిరేకంగా భాజపా పోరాటానికి మద్దత్వివడానికే ఇక్కడికి వచ్చాను. మీరు రెండోసారి అయితే... నేను నాలుగోసారి సీఎం అయ్యాను. కానీ  విపక్షాలతో మీలాగా నేను ఎన్నడూ వ్యవహరించలేదు. మీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి మద్దత్వివడానికే ఇక్కడికి వచ్చాను. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు భాజపా శ్రేణులు విశ్రమించే ప్రసక్తి లేదు’ అని శివరాజ్‌ అన్నారు.

కేసీఆర్‌ను ఎలుకగా మార్చాలి...

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ‘కేసీఆర్‌ ఒక కథ చెబుతా విను.. అడవిలో తపస్సు చేసుకునే సాధువు ఓ ఎలుకను పిల్లి తినేందుకు ప్రయత్నిస్తే రక్షించాడు. దాని ప్రాణాలు కాపాడేందుకు కమండలంలో నీళ్లను చల్లి పులిగా మార్చాడు. పులి రూపంలో ఉన్న ఆ ఎలుక తన పూర్వరూపం బయటకు తెలియకుండా ఉండాలని సాధువునే చంపాలనుకుంది. దీంతో ఆ సాధువు తిరిగి దానిని ఎలుకగా మార్చేశాడు. అలాగే ఎలుక మాదిరిగా ఉన్న కేసీఆర్‌ను ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. 2023 ఎన్నికల్లో తిరిగి ఆయనను ఎలుకగా మార్చాలి’ అన్నారు.

పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై నిలిపివేస్తే నిరసనకారుల చర్యకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మద్దతిస్తారా? ఇదేం రాజనీతి? అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశ్నించారు.

* భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ ‘కరీంనగర్‌లో సంజయ్‌ అరెస్టు జలియన్‌వాలాబాగ్‌ ఘటనను తలపించింది. ఆ నగర పోలీసు కమిషనర్‌ జనరల్‌ డయ్యర్‌లా వ్యవహరించారు’ అంటూ మండిపడ్డారు.

ఉద్యోగులు ఓపిక పట్టాలి: సంజయ్‌

కేసీఆర్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటున్నారని సంజయ్‌ విమర్శించారు. ‘భాజపా దేశంలోనే పెద్ద పార్టీ. నీది గింత పార్టీ. కేసీఆర్‌ను వదిలేది లేదు. ఆయన జైలుకు వెళితే శాశ్వతంగా అక్కడే ఉండాలని ప్రజలు పూజలు చేస్తరు. కేసులు, అరెస్టులే కేసీఆర్‌కు ఆయుధాలైతే.. జైళ్లు, బందిఖానాలే భాజపా పోరుగడ్డలుగా మారతాయి. సీఎంకు వంతపాడుతున్న సంఘాల నేతల భరతం పట్టాలని ఉద్యోగుల్ని కోరుతున్నా. 317 జీవో సవరించేదాకా భాజపా పోరాడుతుంది. లేదంటే ఉద్యోగులు రెండేళ్లు ఓపిక పడితే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం రాగానే ఆ జీవోని రద్దు చేస్తుంది’ అన్నారు. సభలో ప్రసంగిస్తూ ‘మేమేం తప్పు చేశామో కేసీఆర్‌ చెప్పాలి. దళిత మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను జైలుకు పంపారు. ఇంకా అయిదుగురు కార్యకర్తలు జైలులో ఉన్నారు. ఒక కార్యకర్త కాలు విరిగింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. డీకే అరుణ, లక్ష్మణ్‌, రాజాసింగ్‌ కూడా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

* కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యాక భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్‌కి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీసుకు వచ్చిన సంజయ్‌ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పాదాభివందనం చేశారు. భాజపా ఎమ్మెల్యే ఈటల, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, వివేక్‌, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు.

* భాజపా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 9న వరంగల్‌ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, 11న మహబూబ్‌నగర్‌ సభకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వస్తారని భాజపా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని