ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, పాన్‌ అనుసంధానం చేస్తూ ఒకే డిజిటల్‌ ఐడీ?

ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, పాన్‌.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడీలను) అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్‌ ఐడీ’ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ గుర్తింపు పత్రాల సమాకలనం

Updated : 31 Jan 2022 07:16 IST

వివిధ గుర్తింపు పత్రాల సమాకలనంపై కేంద్రం యోచన

దిల్లీ: ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, పాన్‌.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడీలను) అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్‌ ఐడీ’ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్‌ డిజిటల్‌ ఐడెంటిటీస్‌)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్‌ కార్డు నంబరు మాదిరిగా దీనికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) లేదా ఈ-కేవైసీకి ఈ డిజిటల్‌ ఐడీని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్‌, ఓటరు గుర్తింపు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటివాటిని ప్రభుత్వ గుర్తింపు కార్డులుగా వాడుతున్నారు. వీటన్నింటి స్థానంలో ఒకే డిజిటల్‌ ఐడీ ఉండటం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. దీన్ని త్వరలోనే ప్రజాభిప్రాయానికి కేంద్ర ఐటీ శాఖ అందుబాటులో ఉంచుతుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని