SBI: జనాకర్షక పథకాల వ్యయంపై రాష్ట్రాలు పునరాలోచించుకోవాలి

అనేక రాష్ట్రాలు రైతు రుణ మాఫీ వంటి జనాకర్షక పథకాలపై తాహతుకు మించి ఖర్చుపెడుతున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ) గ్రూపు ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ సోమవారం ఒక

Updated : 19 Apr 2022 06:01 IST

జూన్‌తో కేంద్ర జీఎస్టీ పరిహార గడువు ముగుస్తున్నందున జాగ్రత్త వహించాలి

సూచించిన ఎస్‌బీఐ నివేదిక

ముంబయి: అనేక రాష్ట్రాలు రైతు రుణ మాఫీ వంటి జనాకర్షక పథకాలపై తాహతుకు మించి ఖర్చుపెడుతున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ) గ్రూపు ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న జీఎస్టీ పరిహారం వచ్చే జూన్‌తో ముగిసిపోనున్నందున రాష్ట్రాలు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుల్లో మార్పు చేసుకోవాలని సూచించారు. ఏయే కార్యక్రమాలకు ఎంతెంత ప్రాధాన్యమివ్వాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చే జీఎస్టీ పరిహారం కొన్ని రాష్ట్రాల ఆదాయంలో అయిదోవంతుకుపైనే ఉంటోందనీ, ఆ పరిహార నిధులను ఉచిత వరాలపై వెచ్చిస్తున్నాయనీ ఎస్‌.బి.ఐ నివేదిక తెలిపింది. తెలంగాణ తనకు వస్తున్న పన్ను రాబడిలో 35 శాతాన్ని జనాకర్షక పథకాలకు కేటాయించగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ 5 నుంచి 19 శాతం ఆదాయాన్ని ఈ పథకాలకు వెచ్చిస్తున్నాయని వివరించింది. కొన్ని రాష్ట్రాలైతే తమ  సొంత పన్ను ఆదాయంలో 63 శాతాన్ని జనాకర్షక పథకాలకు వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2017లో ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పథకం కింద పరిహారం చెల్లింపు గడువును మరి అయిదేళ్లపాటు పొడిగించాలని చాలా రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కొవిడ్‌-19 వల్ల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అధికమై 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు సగటు విత్త లోటు పెరిగిపోతోందని నివేదిక వెల్లడించింది. ఆరు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో విత్తలోటు 4 శాతాన్ని మించిపోయింది. ఏడు రాష్ట్రాలు తమ బడ్జెట్లలో అంచనావేసిన దానికన్నా ఎక్కువ విత్తలోటు చవిచూశాయి. 11 రాష్ట్రాలు బడ్జెట్‌ అంచనాలకు సమానంగానో తక్కువగానో విత్తలోటును చవిచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అస్సాం, గుజరాత్‌, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి 17 రాష్ట్రాలు తమ జీఎస్డీపీ వాస్తవ వృద్ధి రేటును యావత్‌ దేశ జీడీపీ వృద్ధి రేటుకన్నా ఎక్కువగా చూపిస్తున్నాయనీ, అది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదని ఎస్‌.బి.ఐ నివేదిక వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని