మండలానికి రెండు ఆటస్థలాలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి కనీసం రెండు క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎకరం స్థలంలో క్రీడాప్రాంగణం తయారు

Published : 23 May 2022 04:16 IST

జూన్‌ 2 నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశం

ఇటీవల విడుదల చేసిన నిబంధనల సవరణ

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి కనీసం రెండు క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎకరం స్థలంలో క్రీడాప్రాంగణం తయారు చేయాలని వారం కిందట చెప్పిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లº స్థలాలు లభించడంలేదని, క్షేత్ర స్థాయి విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో జూన్‌ 2 నాటికి మండలానికి కనీసం రెండింటినైనా సిద్ధం చేయాలని నిబంధనలు సవరించింది. ఈ క్రీడాప్రాంగణంలో కనీసం 4 ఆటస్థలాలు (కోర్టులు) ఏర్పాటుచేయాలని సూచించిందని హనుమకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆకవరం శ్రీనివాసకుమార్‌ తెలిపారు.

ప్రాంగణ నిర్వహణకు బాధ్యుడిని నియమించాలి
క్రీడాప్రాంగణం చుట్టూ నర్సరీలో లభించే 300 మొక్కలు తెచ్చి నాటాలి. ప్రాంగణాల నిర్వహణకు బాధ్యుడిని నియమించాలి. మొక్కలను సంరక్షించేందుకు ఒక ఉద్యోగిని నియమించి, ‘ఉపాధి హామీ’ పథకం నుంచి వేతనం చెల్లించాలి. ప్రతి మండలానికో ప్రత్యేక అధికారిని నియమించి వాటిని పర్యవేక్షించాలి. ప్రతి ఆటస్థలం ముందు ‘తెలంగాణ క్రీడాప్రాంగణం’ అని బోర్డు పెట్టాలి.

కబడ్డీ: 13 మీ. పొడవు, 10 మీ. వెడల్పుతో కోర్టును ఏర్పాటు చేయాలి. ఆటస్థలాన్ని మెత్తటి మట్టితో నింపాలి. ఆటగాళ్లు కిందపడినా గాయాలు కాకుండా కోర్టును రూపొందించాలి.

వాలీబాల్‌: 26 మీ. పొడవు, 16 మీ. వెడల్పుతో వాలీబాల్‌ కోర్టును తయారుచేయాలి. 10.5 అడుగుల పొడవున్న కర్రను రెండడుగుల రెండు అంగుళాల మేర పాతిపెట్టి మిగతా కర్ర పైభాగంలో నెట్‌ అమర్చాలి.

ఖోఖో: 27 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు నిడివితో ఆటస్థలాన్ని రూపొందించాలి. ఆరడుగుల ఎత్తున్న రెండు కర్రలను రెండువైపులా నాటి ఆటస్థలాన్ని మెత్తటి మట్టితో నింపాలి.

లాంగ్‌ జంప్‌: 6 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో లాంగ్‌ జంప్‌ పిట్‌ తయారుచేయాలి. అరమీటరు లోతు నుంచే మెత్తటి మట్టి నింపాలి.

వ్యాయామ బార్లు: క్రీడాకారులు వ్యాయామం చేయడానికి సింగిల్‌ లేదా డబుల్‌ ఇనుప బార్లను నిర్మించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని