పోతూపోతూ.. కుండపోత

గత జూన్‌లో రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. అవి వెనుదిరిగే సమయంలో వెళుతూ వెళుతూ కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం

Published : 28 Sep 2022 03:13 IST

 ‘నైరుతి’ నిష్క్రమణకు ముందు భారీవర్షాలు

నేడు, రేపు అక్కడక్కడా జడివానలు

ఈనాడు, హైదరాబాద్‌: గత జూన్‌లో రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. అవి వెనుదిరిగే సమయంలో వెళుతూ వెళుతూ కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిలా వానలు కురిశాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కురవడం గమనార్హం. నగర శివారు నందనం వద్ద అత్యధికంగా 17.1,  లోకేశ్వరం(నిర్మల్‌ జిల్లా)లో 13.3, మన్నెగూడెం(జగిత్యాల)లో 10.5, ఉరుమడ్లరోడ్డు (నల్గొండ)లో 10.4 సెంటీమీటర్ల వంతున భారీవర్షం కురిసింది. మంగళవారం పగలు పలు ప్రాంతాల్లో 2 నుంచి 6 సెం.మీ. వర్షం పడింది. బంగాళాఖాతం పశ్చిమ, మధ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. మరోవైపు తూర్పు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం అక్టోబరు ఒకటిన ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురవవచ్చంటూ పసుపు రంగు హెచ్చరికలు జారీచేసింది.


పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

నాగారం, బంట్వారం, న్యూస్‌టుడే: సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట శివారులో పత్తిచేనులో పిడుగు పడింది. అక్కడే కలుపుతీస్తున్న కూలీ కాట్రేగుల గంగమ్మ(55) మృతిచెందారు. మరో ఘటనలో వికారాబాద్‌ జిల్లా, బంట్వారం పోలీస్‌ ఠాణా పరిధి బొపునారం గ్రామానికి చెందిన బార్వాద్‌ నాగమణి(49), తల్లి నీలమ్మతో కలిసి తమ పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం రావడంతో సమీప గుడిసెలో కూర్చున్నారు. దానిపై పిడుగు పడడంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి నీలమ్మ స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన నీలమ్మకు కుమార్తె విగతజీవిగా కనిపించారు. మృతురాలికి భర్త, ఇద్దరేసి కుమార్తెలు, కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని