పరిశ్రమల స్థాపనకు సహకరిద్దాం

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందించి, ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా స్వాగతించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 31 Jan 2023 05:54 IST

పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పడేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
ఐటీసీ ఆహార తయారీ, లాజిస్టిక్స్‌ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, మెదక్‌: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందించి, ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా స్వాగతించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పిల్లల భవితకు బంగారు బాటలు పడేలా చొరవ తీసుకోవాలన్నారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో తొలిదశగా రూ.450 కోట్లతో ఐటీసీ పరిశ్రమ నిర్మించిన సమీకృత ఆహార తయారీ, లాజిస్టిక్స్‌ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఐటీసీ కూడా వ్యవసాయ అనుబంధ, ఆహార శుద్ధి యూనిట్లు మరికొన్నింటిని నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. మనోహరాబాద్‌లో తయారు చేసే బింగో, ఇతర ఉత్పత్తులకు సంబంధించి స్థానిక రైతుల నుంచి ఆలుగడ్డలను కొనుగోలు చేయాలని సంస్థ ప్రతినిధులను తాను అడిగానని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ పండే పంట నాణ్యత కొంత తక్కువగా ఉందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కలిసి నాణ్యత మెరుగయ్యేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో సస్య, నీలి, శ్వేత, గులాబీ విప్లవాలను సాధించామన్నారు.

తెలంగాణలో అద్భుతమైన సంస్కరణలు: సంజీవ్‌ పురి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి స్వల్ప కాలంలోనే అన్ని రంగాల్లో మెరుగైన పురోగతిని సాధించిందని ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పురి కొనియాడారు. అద్భుతమైన సంస్కరణలతో వ్యాపార, వాణిజ్యానికి అనువైన పరిస్థితులను కల్పించారన్నారు. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ హబ్‌గా మారగా.. తెలంగాణ ‘తయారీ హబ్‌’గా మారుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అసాధారణ తోడ్పాటు వల్ల ఇక్కడ తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల కరెంటు, ఆవిష్కరణలకు టీ-హబ్‌.. ఇలా వినూత్న కార్యక్రమాలతో సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. బంగారు తెలంగాణ సాకారంలో తామూ భాగస్వాములవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు