మాగుంట రాఘవ్‌ కస్టడీ 28 వరకు పొడిగింపు

వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని దిల్లీ రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 28 వరకు పొడిగించింది.

Updated : 19 Mar 2023 04:40 IST

ఈనాడు, దిల్లీ: వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని దిల్లీ రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 28 వరకు పొడిగించింది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఫిబ్రవరి 10న రాఘవ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసి 11న న్యాయస్థానంలో హాజరుపర్చారు. తొలుత న్యాయస్థానం రాఘవ్‌ను పది రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి 20న ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఆ గడువు ముగియడంతో ఈ నెల 4న ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరుపర్చగా కస్టడీని 14 రోజులు పొడిగించారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఎదుట మాగుంట రాఘవ్‌ను శనివారం ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున రాఘవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనతో ఏకీభవించిన ప్రత్యేక జడ్జి.. రాఘవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను తిరిగి తిహాడ్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు రానుంది.

ఈడీ విచారణకు హాజరుకాని మాగుంట శ్రీనివాసులురెడ్డి

దిల్లీ మద్యం విధానం కేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం ఈడీ విచారణకు హాజరుకాలేదు. కేసు దర్యాప్తులో భాగంగా శనివారం విచారణకు హాజరుకావాలని ఎంపీకి ఈడీ గతంలో సమన్లు పంపించింది. ఆయన మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఆయన అన్న దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి కుమారుడు అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో  అక్కడ ఉన్నారని సమాచారం. కుటుంబ సభ్యుని అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని, మరో రోజు వస్తానని ఎంపీ.. ఈడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు