డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి

పనిచేయని రిక్లైనర్‌ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్‌(జెడ్‌) క్లాస్‌ టికెట్‌లో ఎకానమీ క్లాస్‌ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3 ఆదేశించింది.

Updated : 26 Apr 2024 04:54 IST

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: పనిచేయని రిక్లైనర్‌ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్‌(జెడ్‌) క్లాస్‌ టికెట్‌లో ఎకానమీ క్లాస్‌ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3 ఆదేశించింది. డీజీపీ రవిగుప్తా, ఆయన భార్య అంజలిగుప్తా.. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ మీదుగా పెర్త్‌(ఆస్ట్రేలియా)కు వెళ్లేందుకు గతేడాది మే 10న టికెట్లు బుక్‌ చేశారు. మే 23 రాత్రి 11 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా బుక్‌ చేసిన ఎలక్ట్రానిక్‌ రిక్లైనర్‌ పనిచేయకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సిబ్బందికి ఫిర్యాదు చేసినా ప్రత్యామ్నాయ సీట్లు కేటాయించలేదు. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎకానమీ క్లాస్‌ టికెట్లకంటే రూ.48,750 ఎక్కువగా చెల్లించి బిజినెస్‌(జెడ్‌) క్లాస్‌ టికెట్లు బుక్‌ చేసినా నిర్లక్ష్యంగా సేవలందించారని పేర్కొన్నారు. అదనంగా వసూలు చేసిన డబ్బు రీఫండ్‌ చేయకుండా 10 వేల క్రిస్‌ ఫ్లైయర్స్‌ మైల్స్‌ ఆఫర్‌ అంటూ అనైతిక వ్యాపారానికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించారు. విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3 ఇటీవల తీర్పు వెలువరించింది. ఫిర్యాదీదారులు చెల్లించిన టికెట్ల డబ్బు రూ.97,500.. 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసినందుకు పరిహారంగా రూ.లక్ష, కేసు ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఆ మొత్తం డబ్బు రవిగుప్తా, అంజలిగుప్తాలకు చెల్లించాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌కు చెందిన ముంబయి, బెంగళూరు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారులు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ హౌస్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు