సంక్షిప్త వార్తలు(2)

గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)ల విధుల జాబితాలో లేని అదనపు పనులు చేయలేం అని తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి పేర్కొంది.

Updated : 20 Mar 2023 05:20 IST

అదనపు పనులు చేయలేం: వీఆర్‌ఏ హక్కుల సమితి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)ల విధుల జాబితాలో లేని అదనపు పనులు చేయలేం అని తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి పేర్కొంది. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.విజయ్‌, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్‌గౌడ్‌, సహాయ అధ్యక్షులు నర్సింహారావు, రాజయ్య, లింగరాజు, లక్ష్మీనారాయణ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్మల్‌ అర్బన్‌ మండలానికి చెందిన వీఆర్‌ఏ శ్రీనివాస్‌ చెరువు తూము నీళ్లు వదిలేందుకు వెళ్లి అందులోనే పడి మృతిచెందడం దారుణమన్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లు అత్యుత్సాహంతో అదనపు పనులు చేయాలని వీఆర్‌ఏలను ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వీఆర్‌ఏ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


పెండింగు బిల్లులు మంజూరు చేయాలి: టీఆర్టీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు 2022 ఏప్రిల్‌ నుంచి ఇ-కుబేర్‌లో పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్టీఎఫ్‌) ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమేశ్‌, ఇతర ప్రతినిధులు మంత్రిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. జీపీఎఫ్‌ అడ్వాన్స్‌లు, ఇతర చెల్లింపులు, జీఎల్‌ఐ, వైద్య బిల్లులు, సరెండర్‌ లీవ్‌, ఆటోమాటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌, పీఆర్‌సీ బకాయిలకు సంబంధించిన బిల్లులు అందకపోవడంతో ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకైనా వాటిని చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని