రూ.137 కోట్ల క్యూనెట్‌ ఆస్తుల స్తంభన

అత్యధిక కమీషన్లు ఆశ చూపి గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తున్న క్యూనెట్‌ సంస్థకు చెందిన రూ.137 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది.

Published : 30 Mar 2023 05:20 IST

దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ

ఈనాడు, హైదరాబాద్‌: అత్యధిక కమీషన్లు ఆశ చూపి గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తున్న క్యూనెట్‌ సంస్థకు చెందిన రూ.137 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది. ఈడీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న క్యూనెట్‌పై ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 38 కేసులు నమోదయ్యాయి. మంచి కమీషన్లు ఇస్తామని చెబుతూ అమాయకులతో పెట్టుబడులు పెట్టించి, వారి ద్వారా వస్తువులు కొనిపించి ఈ సంస్థ నిషేధిత గొలుసుకట్టు వ్యాపారం చేస్తోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అందులోని క్యూనెట్‌ కార్యాలయం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఆరుగురూ క్యూనెట్‌లో పనిచేస్తున్నవారే. ఈ దుర్ఘటనతో సంస్థ అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనిపై సైబరాబాద్‌ పోలీసులు గతంలో నమోదు చేసిన కేసుల ఆధారంగా.. నిధుల మళ్లింపు అభియోగంపై ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 24వ తేదీన బెంగళూరులో నాలుగు, తెలంగాణలో మూడు చోట్ల సోదాలు నిర్వహించారు. అనంతరం సంస్థతోపాటు దాంతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన 50 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.137 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు