బిల్లులు ఇవ్వాలి.. అనుమతులు రావాలి..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌ బిల్లులు మంజూరు కావాల్సి ఉండటంతోపాటు పలు అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు పేర్కొన్నారు.

Updated : 27 Mar 2024 05:23 IST

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలపై సమీక్షలో ప్రస్తావించిన ఇంజినీర్లు
కర్వెన జలాశయం వరకు పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక
వారం తర్వాత ప్రాజెక్టుల పరిశీలనకు కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌ బిల్లులు మంజూరు కావాల్సి ఉండటంతోపాటు పలు అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులపై మంగళవారం నుంచి కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ సమీక్షలు ప్రారంభించారు. మొదట పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై జలసౌధలో సమీక్ష నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద కర్వెన జలాశయం వరకు నీటిని తరలించే పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో తాగునీటితోపాటు 3.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడానికి వీలవుతుందని అంచనా వేశారు. నార్లాపూర్‌ - ఏదుల జలాశయాల మధ్య కుడికిళ్ల ప్రాంతంలో కీలకమైన 3.5 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ పనులకు సవరించిన అంచనాల మేరకు రూ.680 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ట్రాన్స్‌కోకు కూడా రూ.124 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయన్న చర్చ జరిగింది. వీటిని చెల్లిస్తేనే ఒక టీఎంసీ నీటిని నార్లాపూర్‌ నుంచి కర్వెన వరకు తరలించడానికి మార్గం సుగమం అవుతుందనే చర్చ సమావేశంలో జరిగింది. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తున్న దాదాపు రూ.2,500 కోట్ల బిల్లులను చెల్లిస్తే పనులు వేగం పుంజుకుంటాయని చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకుముందు పిలిచిన టెండర్లన్నింటినీ పక్కన పెట్టాలని ఆదేశించడంతో పాలమూరు కాలువల పనులు కూడా నిలిచిపోయినట్లు ఇంజినీర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాలువల టెండర్లు పూర్తయితేనే డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. టెండర్లపై ఒక నిర్ణయం తీసుకోవాలన్న చర్చ జరిగింది.

హైడ్రాలజీపై దృష్టి..

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు సాధించేలా కృషి చేయాలని కార్యదర్శి ఇంజినీర్లకు సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పర్యావరణ ఉల్లంఘనలు లేకుండా పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదలకు వీలున్న పీఎంకేఎస్‌వై (ఏఐబీపీ) లాంటి పథకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అనుమతుల సాధనలో ప్రధాన అవరోధంగా ఉన్న హైడ్రాలజీ(నీటి కేటాయింపులు) క్లియరెన్స్‌పైనా చర్చించారు. మైనర్‌ ఇరిగేషన్‌లో మిగులు 45 టీఎంసీలు, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలో సాగర్‌ ఎగువన వాడుకునే వీలున్న 45 టీఎంసీలు కలిపి పాలమూరుకు కేటాయింపులు ఉన్నందున సమస్యలేవీ ఉండవన్న చర్చ జరిగింది. అయితే, సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌లలో కేసులు ఉన్నందున హైడ్రాలజీ పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే వారం పాలమూరు ప్రాజెక్టును సందర్శించాలని కార్యదర్శి నిర్ణయించారు. మరోవైపు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని రేగుమాను గడ్డ వద్ద ఉన్న మొదటి పంపుహౌస్‌లో గతంలో నీట మునిగిన పంపుల పునరుద్ధరణపైనా చర్చ జరిగింది. మూడు పంపులను సిద్ధం చేసినప్పటికీ మరో రెండింటిని చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటికే రెండు టీఎంసీల నిల్వ ఉన్న పాలమూరు ఎత్తిపోతల్లోని నార్లాపూర్‌ జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని ఎల్లూరు జలాశయానికి తాగునీటి అవసరాలకు నీరు తరలించాలని, ఆ లోపు కల్వకుర్తి ఎత్తిపోతల్లోని పంపులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. నీటి తరలింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనుండగా.. దీనిపై మిషన్‌ భగీరథ విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని