దండకారణ్యం ‘కోట’కు బీటలు!

మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది.

Published : 03 May 2024 02:53 IST

నాలుగు నెలల్లో 91 మంది మావోయిస్టుల మృతి
205 మంది అరెస్టు.. 231 మంది లొంగుబాటు
సురక్షిత స్థావరాల కోసం నాయకత్వం వెదుకులాట?

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. గత నాలుగు నెలల్లో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి వివిధ రూపాల్లో భారీ నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనం. నలువైపుల నుంచి చొచ్చుకొస్తున్న కేంద్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భద్రతా బలగాలు మావోయిస్టులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుండగా.. ఈ విపత్తు నుంచి బయటపడే మార్గాల అన్వేషణలో కేంద్ర కమిటీ తలమునకలైందని తెలుస్తోంది.

తొలుత మావోయిస్టు ఉద్యమానికి కేంద్రస్థానంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పోలీసులు పైచేయి సాధించడంతో.. రెండు దశాబ్దాల క్రితమే మావోయిస్టు అగ్రనాయకులంతా దండకారణ్యంలోని అబూఝ్‌మాడ్‌కు తరలి వెళ్లిపోయారు. దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో మావోయిస్టు కార్యకలాపాలు బాగా తగ్గాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచే వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దండకారణ్యంలోని భౌగోళిక పరిస్థితులు, స్థానిక గిరిజనుల మద్దతుతో ఇన్నాళ్లూ మావోయిస్టులు అక్కడ సురక్షితంగా మనగలిగారు.  ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున సీఆర్‌ఫీఎఫ్‌ బలగాలను దించి, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సహకారంతో కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తూ దండకారణ్యంలోకి చొచ్చుకెళుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భద్రతా బలగాలు వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ చివరి వరకూ ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 91కి చేరింది. గత 15 రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలోనే 39 మంది మావోయిస్టులు మరణించారు. 205 మంది అరెస్టయ్యారు. మరో 231 మంది లొంగిపోయారు. ఇలా మొత్తంగా మావోయిస్టు పార్టీ 527 మందిని కోల్పోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడుతుందని భావిస్తున్నారు.

వృద్ధులైన కేంద్ర కమిటీ సభ్యులు..

17 మందితో కూడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఎక్కువ మంది వృద్ధాప్య సమస్యలతో సతమతం అవుతున్నారు. భద్రతా బలగాలు ఇలానే చొచ్చుకు వస్తే.. కేంద్ర కమిటీ సభ్యులను తరలించడానికి సురక్షిత స్థావరాల కోసం మావోయిస్టులు వెదుకుతున్నట్లు తెలుస్తోంది. వీరి కేంద్ర కమిటీలో అత్యధికంగా 10 మంది తెలుగువారు ఉండగా.. వారిపై పోరులోనూ తెలుగు ఐపీఎస్‌ అధికారి కీలకపాత్ర పోషిస్తుండడం ఆసక్తికరంగా మారింది. విజయవాడకు చెందిన 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఇందిరకల్యాణ్‌ కాంకేర్‌ జిల్లా సీనియర్‌ ఎస్పీగా పనిచేస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోగా.. ఆ ఆపరేషన్‌కు కల్యాణ్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని