niranjan reddy: రాజీనామా సవాలుకు తోక ముడిచిన సంజయ్‌

‘వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల లోగా లేఖ తెప్పించాలని, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని తాను విసిరిన సవాలుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తోక

Updated : 09 Aug 2022 12:02 IST

ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి లేఖ తెప్పించమంటే స్పందన లేదు
దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్రం లేఖను బయటపెడితే మళ్లీ అడుగుతున్నారు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం ఇచ్చిన లేఖను చూపుతున్న నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, వనపర్తి, న్యూస్‌టుడే: ‘వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల లోగా లేఖ తెప్పించాలని, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని తాను విసిరిన సవాలుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తోక ముడిచారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు. గురువారం ఆయన రెండు దఫాలుగా విలేకరులతో మాట్లాడారు. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ.. ‘‘యాసంగిలో రైతులు సాగుచేసే వరిపంట కొంటామని సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రం నుంచి సంజయ్‌ అనుమతి లేఖ తెప్పించాలి. లేదంటే కేంద్రం లేఖ ఇచ్చే వరకు భాజపా నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ రాజీనామా చేయాలి. ఒకవేళ ధాన్యం కొనుగోలుపై మాట్లాడింది అబద్ధమైతే నేనే రాజీనామా చేస్తా’’ అని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సాయంత్రం వనపర్తిలో మాట్లాడుతూ.. ‘‘దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం చెప్పిందని మేమంటే.. కేంద్రం నుంచి అలాంటి లేఖ ఏమైనా ఉంటే బయటపెట్టమని సంజయ్‌ అడిగారు. ఇప్పుడు లేఖను చూపిస్తే ఆయన మళ్లీ అడగడం విడ్డూరంగా ఉంది. ఆయనకు ఆంగ్లం తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ రాష్ట్రంలో మాదిరే తెలంగాణలోనూ కేంద్రం ఎందుకు వరి ధాన్యం సేకరించదని ప్రశ్నించారు.

మూడు గంటల్లో ముగిసిన సంజయ్‌ దీక్ష

‘‘బండి సంజయ్‌ రైతు దీక్ష అంటూ హడావిడి చేశారు. కేవలం మూడు గంటలకే దీక్ష ముగించి పారిపోయిన వారు రేపటి నుంచి తెలంగాణ మొత్తం దీక్షలు చేస్తారా? అసలు ఎందుకు దీక్ష తలపెట్టారో ఆయనకే తెలియాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి కల్పించి పచ్చని పంటలను సాగు చేస్తున్నందుకా? రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నందుకా’’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలుసు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పంటలు కొనడం లేదని సాగు చేసిన పంటలను రైతులు తగులబెట్టుకుంటున్నట్లు భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ ట్వీట్‌ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీదికి కేంద్ర మంత్రి కుమారుడు వాహనం ఎక్కించిన విషయం మరవొద్దు. చేతనైతే నల్ల చట్టాలకు, విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి రద్దు చేయించాలి’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి సవాలు విసిరారు.

కేంద్రం కొనగా మిగిలింది మేం కొంటాం

‘‘రాష్ట్రంలో వానాకాలంలో 1.35 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కేంద్రానికి తెలిపితే 59.70 లక్షల టన్నుల కొనుగోలుకు అంగీకరించింది. మొత్తం కొనాలని చెబితే.. అంత వరి వేశారా? శాటిలైట్‌లో కనిపించడం లేదు అంటూ తాత్సారం చేస్తోంది. ఇప్పటికీ ఉన్నతాధికారులు దిల్లీలో ఉండి కేంద్రానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వానాకాలం పంటలో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయగా మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. ఇందుకు ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపారు.


సంజయ్‌ ఆ లేఖ తెస్తే పాదాభివందనం చేస్తా: మంత్రి ఎర్రబెల్లి

బాలసముద్రం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష ఎందుకో తమకు అర్థం కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని బండి సంజయ్‌ కేంద్రం నుంచి లేఖ తెస్తే తాను పాదాభివందనం చేస్తానన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసిందన్నారు. వానాకాలం, యాసంగి పంటలను తప్పకుండా కొంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని