Senegal: ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 40మంది దుర్మరణం!

సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు ప్రమాదంలో 40మంది దుర్మరణం చెందగా.. 78మంది గాయపడినట్టు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.

Published : 08 Jan 2023 22:36 IST

దాకర్‌: ఆఫ్రికా ఖండంలోని సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. ప్రమాదవశాత్తు రెండు బస్సులు ఢీకొట్టడంతో 40మంది దుర్మరణం చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదద ఘటన ఆదివారం తెల్లవారు జామున 3.30గంటల సమయంలో చోటుచేసుకున్నట్టు సెనెగల్‌ అధ్యక్షుడు మాకే సాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. గ్నిబీలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 40మంది మరణించగా.. అనేకమంది తీవ్ర గాయాలపాలయ్యారని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్‌ చేశారు. వారి మృతి పట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలపై చర్చించేందుకు అంతర్‌ మంత్రిత్వ మండలిని నిర్వహిస్తామని అధ్యక్షుడు తెలిపారు.

ఈ ఘటనపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చీక్‌ డియోంగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్‌ అయి రోడ్డుపై అడ్డం తిరగ్గా.. ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనలో 78మందికి గాయాలయ్యాయని.. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో రెండు బస్సుల ముందు భాగాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధ్వాన్నమైన రోడ్లకు తోడు కార్లు కండిషన్‌ బాగా లేకపోవడం, డ్రైవర్లు రహదారి నియమాలు పాటించకపోవడంతో సెనెగల్‌లో తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. 2017లోనూ ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రెండు బస్సులు పరస్పరం ఢీకొట్టుకోవడంతో అప్పట్లో 25మంది దుర్మరణం చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని