US shooting: అమెరికా మాల్‌లో దుండగుడి కాల్పులు.. 8 మంది దుర్మరణం

US mall shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. అలెన్‌ సిటీలోని మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. 

Updated : 07 May 2023 12:33 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని (USA) తుపాకీ సంస్కృతి మరికొందరి ప్రాణాలు బలిగొంది. ఓ మాల్‌లో దుండగుడు విచక్షణ రహింతంగా కాల్పులకు (shooting) పాల్పడిన ఘటనలో చిన్నారులు సహా 8 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడని చెప్పారు. టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌ నగర శివారు అలెన్‌లోని ప్రీమియర్‌ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. షాపింగ్‌ కోసం వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసింది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో ఓ వ్యక్తి మాల్‌ బయట కారు ఆపి.. కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంబంధిత వీడియోలు కూడా బయటకొచ్చాయి. కాల్పుల ఘటనపై స్థానికులు అలెన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు. మృతుల్లో 5 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయస్కులు ఉన్నారని మాత్రం వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తుపాకీ సంస్కృతికి అద్దం పట్టే ఈ తరహా భారీ ఘటనలు అమెరికాలో సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సగటున వారానికో ఘటన చోటుచేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి. తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టెక్సాస్‌ గవర్నర్‌తో మాట్లాడారు. మరోవైపు ఘటన అనంతరం మాల్‌లోని వారందరినీ సురక్షిత ప్రదేశాలకు పోలీసులు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు