‘పారిస్‌ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు

పారిస్‌ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 05 May 2024 06:12 IST

అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: పారిస్‌ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. జర్మనీలోని మెర్కేటర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ గ్లోబల్‌ కామన్స్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎంసీసీ) నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలని పారిస్‌ ఒప్పందం పేర్కొంది. దీనికి అనుగుణంగా భాగస్వామ్య దేశాలు కర్బన ఉద్గారాల నిర్మూలనకు ప్రణాళికలను ప్రకటించాయి. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో అతి ముఖ్యమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ నిర్మూలన (సీడీఆర్‌)కు సంబంధించిన వాతావరణ విధానాన్ని దేశాలు ఇంకా మెరుగుపరచాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో సీడీఆర్‌ది చాలా ముఖ్యమైన పాత్రని వివరించారు. దీనితోపాటు ఇతర ఉద్గారాల తగ్గింపునకు దేశాలకు మరింత అవగాహన అవసరమని చెప్పారు. 2010 నుంచి ఏటా.. దేశాలిచ్చిన హామీలు, 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసుకోవడానికి మధ్య ఉన్న అంతరాన్ని వారు విశ్లేషించారు. దేశాలిచ్చిన హామీలను అమలు చేస్తే.. 2030 నాటికి మానవాళి 0.5 గిగా టన్నుల మేర కార్బన్‌ డైఆక్సైడ్‌ను తొలగించగలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి అది 1.9 గిగా టన్నులకు చేరుతుందని వివరించారు. అయితే ఒక అంచనా ప్రకారం అప్పటికి తొలగించాల్సిన ఉద్గారాలు 5.1 గిగా టన్నుల మేర ఉంటాయని చెప్పారు. ఆ లెక్కన 2050 నాటికి 3.2 గిగా టన్నుల లోటు ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని