నిజ్జర్‌ హత్యకేసు నిందితులకు ‘పాక్‌ ఐఎస్‌ఐ’తో సంబంధాలు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Updated : 05 May 2024 06:01 IST

ఆంగ్ల మీడియా కథనాల వెల్లడి

దిల్లీ, ఒట్టావా, భువనేశ్వర్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న నిందితులు కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్‌ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్‌ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని మాకు తెలిసింది’’ అని సదరు వర్గాలు మీడియాకు వివరించాయి.మరోపక్క నిజ్జర్‌ హంతకులపై ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. ‘‘ఈ హత్య ఘటనలో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నాం. నిందితులందరికీ గుర్తించి అరెస్టు చేస్తాం’’ అని కెనడా పోలీసులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


కెనడా అంతర్గత రాజకీయాలతోనే ఆ ఘటనలు: జైశంకర్‌

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన  పై మేరకు సమాధానమిచ్చారు.


కెనడా రాజకీయాల్లో భారత్‌ జోక్యం
అధికారిక దర్యాప్తు నివేదిక వెల్లడి

ఖలిస్థానీ తీవ్రవాదుల సమస్య సహా పలు ప్రధాన అంశాల్లో దిల్లీ ప్రయోజనాల కోసం కెనడా రాజకీయ నేతలను ప్రభావితం చేసేందుకు కొందరు భారత అధికారులు, స్థానిక ప్రతినిధులు పలు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని దర్యాప్తు నివేదిక ఒకటి పేర్కొంది. ఈ మేరకు కమిషనర్‌ మేరీ జోసీ హూగ్‌ నేతృత్వంలోని ఇండిపెండెంట్‌ పబ్లిక్‌ ఎంక్వైరీ శుక్రవారం విడుదల చేసిన తన మధ్యంతర నివేదికలో తెలిపింది. 2019, 2021లో జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిర్ధారించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని ఎన్నికల వ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పింది. కెనడాకు వ్యతిరేకంగా విదేశీ జోక్యంలో ప్రధాన నిందిత దేశం చైనా అని తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని