Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్‌

భవిష్యత్తులో కొవిడ్‌ వంటిదే మరో మహమ్మారి ప్రపంచంపై దాడిచేసే అవకాశముందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

Updated : 26 Sep 2023 07:04 IST

బీజింగ్‌: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి లక్షలాది మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. ప్రస్తుతం దీని ప్రభావం తగ్గి అంతా సద్దుమణిగినా.. భవిష్యత్తులో కరోనా వంటి మరో ప్రాణాంతక వైరస్‌ దాడి చేసే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్ట్‌ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 

చైనాకు చెందిన జెంగ్లీ.. జంతువుల ద్వారా వ్యాపించే వైరస్‌లపై పరిశోధనలు చేస్తుంటారు. ఈమెకు ‘బ్యాట్‌వుమెన్‌’ అనే పేరుంది. ‘అసెస్‌మెంట్‌ అండ్‌ సెరో-డయాగ్నోసిస్‌ ఫర్‌ కరోనా వైరసెస్‌ విత్‌ రిస్క్‌ ఆఫ్‌ హ్యూమన్‌ స్పిల్‌ఓవర్‌’ పేరుతో జెంగ్లీ పరిశోధనలు చేశారు.‘కరోనా వైరస్‌ వ్యాధులకు కారణమై ఉంటే.. కచ్చితంగా భవిష్యత్తులోనూ మళ్లీ మహమ్మారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబ్బిలాలు, ఎలుకలు, ఒంటెలు, పందులు పాంగోలియన్‌ తదితర జీవులతోనే ఈ వ్యాధికారక వైరస్‌ వ్యాపిస్తుంది’ అని పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొన్నట్లే.. భవిష్యత్తులో వచ్చే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సంసిద్ధంగా ఉండాలన్నారు. 

వైరస్‌ లక్షణాలు, జనాభా, జన్యు వైవిధ్యం, గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన వైరస్‌ల ఆధారంగా మానవాళికి ప్రమాదకరమైన 40 కరోనా వైరస్‌ జాతులపై వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలతో కలిసి జెంగ్లీ ఈ పరిశోధనలు చేశారు. వాటిలో ఇప్పటికే ఆరు జాతుల కరోనా వైరస్‌లు మనిషికి సోకి వ్యాధులకు కారణమయ్యాయని, మరో మూడు జాతులు జంతువులకు కూడా సోకినట్లు తేలింది. కాగా.. జెంగ్లీ వాదనను చైనాకు చెందిన ఇతర వైరాలజిస్ట్‌లు తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని