Elon Musk: ‘మా మస్కే’..! చైనా మనసు దోచుకొన్న టెస్లా అధిపతి..!

టెస్లా అధిపతి ఇటీవలే తైవాన్‌ సమస్యకు కూడా తనదైన శైలిలో సూచించిన పరిష్కారంపై చైనా, తైవాన్‌లు స్పందించాయి. ఈ ప్రతిపాదన విని చైనా పొంగిపోగా.. తైవాన్‌ మండిపడింది.

Updated : 10 Oct 2022 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే తైవాన్‌ సమస్యకు కూడా తనదైన శైలిలో పరిష్కారం సూచించారు. ఈ ప్రతిపాదన విని చైనా పొంగిపోగా.. తైవాన్‌ మండిపడింది. మస్క్‌ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా-తైవాన్‌ వివాద పరిష్కారం గురించి మాట్లాడుతూ ‘‘నా ప్రతిపాదన ఏంటంటే..  చైనాలో తైవాన్‌ను ఓ ప్రత్యేక పరిపాలన జోన్‌గా చేయాలి. ఇది సహేతుకంగా ఉంటుంది. కాకపోతే ఇది అందరినీ సంతోషపెట్టకపోవచ్చు’’ అని పేర్కొన్నారు.  మస్క్‌ ప్రతిపాదన చెవిన పడగానే అమెరికాలోని చైనా రాయబారి క్విన్‌ గ్వాంగ్‌ స్పందించారు. ఈ ప్రతిపాదనకు గాను మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘ తైవాన్‌ను ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్నందుకు, తైవాన్‌ జలసంధిలో శాంతికి పిలుపునిచ్చినందుకు మస్క్‌కు ధన్యవాదాలు. వాస్తవానికి ఒక దేశం రెండు వ్యవస్థలన్నవి తైవాన్‌ ప్రశ్నలను పరిష్కరించేందుకు చైనా ప్రాథమిక విధానాలు’’ అని పేర్కొన్నారు.

మరో వైపు ఈ ప్రతిపాదనలపై తైవాన్‌ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్ర్యం అమ్మకానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. వాషింగ్టన్‌లో తైవాన్‌ అనధికార ప్రతినిధి బి ఖిమ్‌ హిస్సావో ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘తైవాన్‌ చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది. కానీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మాత్రం విక్రయానికి లేవు. భవిష్యత్తు కోసం చేసే శాశ్వత ప్రతిపాదనలు శాంతియుతంగా, భయరహితంగా, తైవాన్‌ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా ఉండాలి’’ అని  మస్క్‌కు చురకలంటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని